
గుంటూరులో 20 హైటెక్‌ ఈ-బస్‌ బేలు ఈనాడు, అమరావతి ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఇలా.. గుంటూరు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరచడం, నగర సుందరీకరణే లక్ష్యంగా నగరపాలకసంస్థ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 20 అత్యాధునిక ఈ-బస్‌బేలను నిర్మించేందుకు ముందుకొచ్చింది. లక్ష్మీపురం ప్రధాన రహదారి వెంబడి ఇదివరకే ఈ తరహా నిర్మాణాలు చేపట్టడం తెలిసిందే. ప్రస్తుతం నగరంలో మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా నిర్మించే ఈ బస్‌ బేలలో ఒకేసారి 40 మంది ప్రయాణికులు కూర్చునే అవకాశం ఉంటుంది. వీటిలో ఉచిత వైఫై, ప్రథమ చికిత్స టూల్‌ బాక్స్, మరుగుదొడ్లు, ఏసీ సౌకర్యం, మొబైల్‌ ఛార్జింగ్‌ యూనిట్, బ్యాంకు ఏటీఎం, బస్సు రూట్లను తెలిపే డిజిటల్‌ బోర్డులు వంటి అన్ని ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది డిసెంబర్‌లోనే దీనికి సంబంధించిన అడుగులు పడ్డాయి. నాటి స్థాయీ సంఘం సమావేశంలో మొత్తం 20 చోట్ల ఏర్పాటు చేసేందుకు అప్పటి కమిషనర్, మేయర్‌ ఆమోదముద్ర వేశారు. అయితే, ఆ తర్వాత కాలంలో దీనిపై స్తబ్ధత ఏర్పడటం..ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియ పూర్తయి కొన్నిచోట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 5 సంవత్సరాల కాలపరిమితికి బీవోటీ పద్ధతిలో ఈ ప్రాజెక్టును అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండు నుంచి పెదకాకాని వెళ్లే మార్గంలో ఒకటి నిర్మాణంలో ఉండగా, ఆర్టీసీ బస్టాండు వద్ద మరొకటి చివరిదశలో ఉంది. నగరంలో గుజ్జనగుండ్ల ట్యాంకు వద్ద, రాధాకృష్ణ థియేటర్‌ ఎదుట, వాసవీ క్లాత్‌ కాంప్లెక్స్‌ వద్ద, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు చిల్లీస్‌ రెస్టారెంట్‌ వద్ద, కొరిటెపాడు పార్కు ఎదురు, హిందూ కాలేజీ వెనుక పల్నాడు బస్టాండు వద్ద, స్వాతి థియేటర్‌ వద్ద ఉన్న రఘురామిరెడ్డి ఆసుపత్రి ఎదురుగా ఏర్పాటు చేయాలని స్థాయీసంఘం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, చుట్టుగుంట సెంటర్‌లో, ఆర్టీవో వైజంక్షన్‌ వద్ద, మణిపురం ఫ్లైఓవర్‌ దగ్గరలో ఓల్డ్‌క్లబ్‌ రోడ్డు మూల వద్ద నెలకొల్పాలన్నది ఉద్దేశం. కలెక్టర్‌ ఆఫీసు రోడ్డులో మీసేవ సెంటర్‌ వద్ద, నాజ్ సెంటర్‌ గుంట గ్రౌండ్‌ ముందు, బృందావన్‌ గార్డెన్స్‌లో ఎన్టీఆర్‌ స్టేడియం చిన్నగేటు లోపల, ఆర్టీసీ బస్టాండులో ఇన్‌గేట్‌ నుంచి అవుట్‌ గేట్‌ వరకు.. రైల్వేస్టేషన్‌ దక్షిణం వైపు జీజీహెచ్‌ ఎదురుగా, విద్యానగర్‌ ఐటీసీ హోటల్‌ వద్ద, జీటీరోడ్డులో ఐటీసీ వద్ద, ఏసీ కాలేజీ ఎదురుగా, వంద అడుగుల రోడ్డు ఆటోనగర్‌ ఎస్‌బీఐ ఎదురుగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు జీఎంసీ వర్గాలు తెలిపాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





