
ముంబై: దిశా సాలియన్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమె ఎవరో తనకు తెలియదని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే అన్నారు. ఆమె మరణంతో తనను ముడిపెట్టడానికి పదేపదే జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ఖండించారు. ఆధారాలు లేని దుష్ప్రచారమని ఆరోపించారు. (Aaditya Thackeray) 2020 జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు ఆయనకు మేనేజర్‌గా పనిచేసిన దిశా సాలియన్ జూన్ 8న ముంబైలోని ఒక భవనం పైనుంచి పడి మరణించారు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కొత్తగా దర్యాప్తు జరుపుతున్నది. కాగా, దిశా సాలియన్ మరణం కేసులో మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఆయన తండ్రి, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, నటులు డైనో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిల పాత్రపై విచారణ జరుపాలని తాజా ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొన్నది. పలువురు పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ సిబ్బంది, వైద్యులు, ఇతరుల ప్రస్తావన కూడా అందులో ఉన్నది. మరోవైపు దిశా సాలియన్ మరణం కేసుపై సీబీఐ తాజా దర్యాప్తులో తన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంపై ఆదిత్య ఠాక్రే బుధవారం ఎక్స్‌లో స్పందించారు. ‘అనవసరపు విషయాలు పక్కన పెట్టి, మరోసారి నిజాలు మాట్లాడుకుందాం: దిశా సాలియన్‌ను నేను ఎప్పుడూ కలవలేదు, ఆమె ఎవరో నాకు తెలియదు’ అని పేర్కొన్నారు. అలాగే రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత కక్ష, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాదాపు ఆరేళ్లుగా కొందరు వ్యక్తులు తన పేరును ఈ కేసుతో ఉద్దేశపూర్వకంగా ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. ఈ కేసులో ఎటువంటి జోక్యం, రాజకీయ ప్రమేయం లేదా వ్యక్తిత్వ హననం లేకుండా, నిష్పక్షపాతంగా విచారణ జరుగాలని ఆయన కోరారు.



