
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సమగ్రమైన 'మినరల్ మ్యాపింగ్' చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికితీయడమే కాకుండా, వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "దేశంలోని కొన్ని రాష్ట్రాలు కేవలం ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయంతోనే రెవెన్యూ మిగులు సాధిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ఖనిజ సంపదకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ ద్వారా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించి, ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించాలి" అని అన్నారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యూమినా వంటి ఖనిజాలకు ఇక్కడే విలువ జోడింపు ప్రక్రియలు జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.అరుదైన ఖనిజాలపై ప్రత్యేక దృష్టిఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్, అణు ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాల్లో కీలకంగా ఉపయోగపడే అరుదైన భూ ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్)పై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏపీ, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో లభ్యమయ్యే ఈ ఖనిజాల కోసం ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.