
హైదరాబాద్: రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు.
ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగసభా? అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy)ని ఉద్దేశిస్తూ ‘ఎక్స్’లో కేటీఆర్ పోస్ట్ చేశారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారు. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీ చేసి చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలి. ఇప్పటికే రూ.50 వేల కోట్లతో చేయాల్సిన రూ.2లక్షల రుణమాఫీని చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశారు. దిల్లీ టూర్లు, పబ్లిక్ మీటింగ్లకు పెడుతున్న రూ.కోట్ల ఖర్చును ఆదా చేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేది.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి దృష్టి మళ్లించేందుకు చేపట్టే చర్యలు ఏమాత్రం పనిచేయవు. కేసీఆర్ ఠంచనుగా 11 సార్లు రూ.73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.