.webp&w=3840&q=75)
తెలంగాణ రాష్ట్రంలో జనాభా, కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తాజాగా చేపట్టిన జనగణన తొలి దశ అంచనాల ప్రకారం..
ప్రస్తుతం రాష్ట్రంలో నివసిస్తున్న మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపు కోటీ 14 లక్షలకు చేరింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోలిస్తే.. ఈ తాజా జనగణనలో కుటుంబాల సంఖ్య భారీగా పెరగడం విశేషం. కేవలం కుటుంబాలే కాదు.. తెలంగాణ ఓవరాల్ జనాభా కూడా మునుపటి అంచనాలను తలకిందులు చేస్తూ భారీగా పెరిగింది.
ఈ అంచనాల ప్రకారం చూస్తే.. తెలంగాణ మొత్తం కుటుంబాలలో సింహభాగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ లోనే ఏకంగా 36 లక్షల కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తేలింది. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే, మన దేశంలోని గోవా రాష్ట్రంలో ఉండే మొత్తం కుటుంబాల కంటే కూడా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఉపాధి కోసం ఎంతలా జనం ఇక్కడికి తరలివస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.
ఇక జనాభా విషయానికి వస్తే తాజా లెక్కలు విస్మయం గొల్పుతున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ సర్వేల ప్రకారం తెలంగాణ జనాభా 3.65 కోట్లలోపే ఉండవచ్చని భావించారు. కానీ ప్రస్తుత కేంద్ర జనగణన ప్రాథమిక నివేదికల ప్రకారం తెలంగాణ జనాభా ఏకంగా 4.35 కోట్లను దాటేసింది. 2010-11 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారిక జనగణన సమయంలో తెలంగాణ ప్రాంత జనాభా కేవలం 3.50 కోట్లుగా, కుటుంబాల సంఖ్య 83.05 లక్షలుగా ఉండేది. ఆ పాత లెక్కలతో పోల్చి చూస్తే.. ఇప్పుడు తెలంగాణ జనాభా దాదాపు 85 లక్షలు పెరగగా, కుటుంబాల సంఖ్య ఏకంగా 31 లక్షలు పెరిగింది.
జిల్లాల వారీగా చూస్తే.. పాత లెక్కల్లో రంగారెడ్డి జిల్లా 12.35 లక్షల కుటుంబాలతో టాప్‌లో ఉండేది. అయితే జిల్లాల పునర్విభజన తర్వాత సమీకరణాలు మారాయి. కొత్త సరిహద్దుల ప్రకారం తాజా అంచనాలలో ఉమ్మడి నల్గొండ జిల్లా 10.43 లక్షల కుటుంబాలతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10.02 లక్షలు, వరంగల్ జిల్లాలో 9.69 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 9.12 లక్షల కుటుంబాలు నమోదయ్యాయి. అలాగే మెదక్ లో 8.43 లక్షలు, ఆదిలాబాద్ లో 8.00 లక్షలు, ఖమ్మంలో 7.75 లక్షలు, నిజామాబాద్ లో 7.11 లక్షలు, కొత్త సరిహద్దుల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 5.65 లక్షల కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేశారు.
పట్టణీకరణ ఏ స్థాయిలో పెరిగిందో నగరపాలక సంస్థల (కార్పొరేషన్ల) డేటా చూస్తే అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 36 లక్షల ఇళ్లను పక్కన పెడితే.. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 2.55 లక్షలు, కరీంనగర్లో 1.18 లక్షలు, నిజామాబాద్‌లో 1.06 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్ నగరాల పరిధిలో కూడా లక్షకు పైగా ఇళ్లు ఉన్నాయి. చిన్న నగరాలైన రామగుండంలో 63 వేలు, మంచిర్యాలలో 60 వేల కుటుంబాలు నమోదయ్యాయి. ఈ డేటా ప్రకారం చూస్తే కొన్ని కొత్త జిల్లాల మొత్తం కుటుంబాల సంఖ్య కంటే.. వరంగల్, నిజామాబాద్ లాంటి సిటీల పరిధిలోనే ఎక్కువ కుటుంబాలు నివసిస్తున్నాయి.
ఈ భారీ జనగణన ప్రక్రియకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగిన మొదటి దశలో అధికారులు కేవలం ఇళ్లు, భవనాల వివరాలను మాత్రమే నమోదు చేశారు. అతి ముఖ్యమైన రెండో దశ డిజిటల్ ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈ రెండో దశలోనే ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్ ద్వారా సేకరిస్తారు. దీనికంటే ముందే త్వరలోనే నల్గొండ జిల్లా తిప్పర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, హైదరాబాద్ శివారు రామచంద్రపురంలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించి ఆన్లైన్ సిస్టమ్‌లోని లోపాలను సరిచేయనున్నారు. పూర్తి వివరాలతో కూడిన ఫైనల్ రిపోర్ట్ 2027 చివరి నాటికి అధికారికంగా విడుదల కానుంది.
అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ ధమాకా: 33% లిస్టింగ్ లాభాలతో బంపర్ ఓపెనింగ్?
.