
దేశ సంస్కృతి, హస్తకళల వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల నేతలకు ఆయన అంది
ంచే బహుమతుల్లో ఇవే ఉంటాయి. ఇవి వస్తువులుగా మాత్రమే కాకుండా, ఇరు దేశాల మధ్య ఉండే చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తాయి. వీటిని నిలబెట్టుకోవడంలో ఆయన ఓ అడుగు ముందే ఉంటారు.ప్రస్తుతం ప్రధాని మోదీ సెషెల్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆ దేశ ప్రభుత్వాధినేతలకు మోదీ అందించిన కానుకలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. మేక్ ఇన్ ఇండియా గొప్పదాన్ని చాటిచెప్పేలా వీటిని ఏరికోరి ఎంపిక చేసుకున్నారాయన. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, సిక్కిం విశిష్ట కళా నైపుణ్యాలను ఈ కానుకల ద్వారా సెషెల్స్ దేశ ప్రముఖులకు పరిచయం చేశారు ప్రధాని మోదీ.మొరాదాబాద్ ఇత్తడి తాబేలు..సెషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీకి ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకమైన మొరాదాబాద్ ఇత్తడి తాబేలును బహుమతిగా ఇచ్చారు. భారత బ్రాస్ సిటీగా మొరదాబాద్ కు పేరుంది. ఇక్కడి కళాకారులు ఈ అద్భుతమైన తాబేలును తయారు చేశారు. దీని కవచంపై చెక్కిన నగిషీలు, మెరిసే ఇత్తడి పూత తరతరాలుగా వస్తున్న వారి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనం. లోహాలను కరిగించి, విభిన్న రూపాలుగా మలచడంలో కళాకారులు సిద్ధహస్తులు.భారతీయ సనాతన ధర్మం, తత్వశాస్త్రంలోనూ తాబేలుకు ప్రత్యేక స్థానం ఉంది. జ్ఞానం, స్థిరత్వం, శతాధిక ఆయుష్షు, ఓర్పునకు చిహ్నంగా భావిస్తారు. సెషెల్స్ దేశంలోని సహజ సిద్ధ ద్వీపాల్లోని అరుదైన అల్దాబ్రా జెయింట్ తాబేలు ఆ దేశ జాతీయ పర్యావరణ వారసత్వానికి ప్రతీక కూడా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అందించిన ఈ ఇత్తడి తాబేలు కానుక సెషెల్స్ పౌరుల హృదయాలను చూరగొంది. రెండు దేశాల మధ్య వర్ధిల్లే నిరంతర స్నేహానికి, పరస్పర అవగాహనకు ఈ హస్తకళాఖండం అత్యున్నత గుర్తింపుగా నిలుస్తుంది.తోడా శాలువా, కాంచీపురం పట్టు శోభ..సెషెల్స్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అజారెల్ ఎర్నెస్టాకు తమిళనాడుకు చెందిన ప్రాచీన తెగ తోడా కమ్యూనిటీ చేతులతో రూపొందించిన ప్రత్యేక చేనేత శాలువాను బహూకరించారు. తెల్లటి కాటన్ వస్త్రంపై ఎరుపు, నలుపు రంగుల డిజైన్లతో అల్లిన ఈ శాలువాను పుఖూర్ అనే విశిష్ట హస్తకళా నైపుణ్యంతో తయారు చేస్తారు. ప్రకృతి వైవిధ్యాన్ని గౌరవిస్తూ పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన జ్ఞానాన్ని కాపాడుకోవడంలో తోడా తెగ ప్రతిభకు ఇది ఒక అద్దం పడుతుంది.సెషెల్స్ ద్వితీయ ప్రథమ మహిళ లీనా పిళ్లైకి భారతదేశంలోనే అత్యంత సుప్రసిద్ధమైన కాంచీపురం పట్టు చీరెను బహుమతిగా ఇచ్చారు మోదీ. కాంచీపురంలో రూపుదిద్దుకున్న ఇది స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారైంది. ఎరుపు, ఆకుపచ్చ, బంగారు వర్ణాల ఆకర్షణీయమైన అంచులతో పాటు, మెరూన్ రంగుపై బంగారు జరీ డిజైన్లను పొందుపరిచారు. దేవాలయాల శిల్పకళా రూపాలు, నెమళ్ళు, లతలు, రేఖాగణిత నమూనాలతో నేసిన ఈ డిజైన్లు భారతీయ సంప్రదాయ చేనేత కళాకారుల ప్రతిభకు అద్భుత నిదర్శనంగా చెప్పుకోవచ్చు.సిక్కిం ఆర్కిడ్ పెయింటింగ్‌..సెషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిళ్లైకి ప్రధాని మోదీ సిక్కింకు చెందిన ఆర్కిడ్ పెయింటింగ్‌ను అందజేశారు. ఈ పెయింటింగ్‌లో నెమలి, సెషెల్స్ జాతీయ పుష్పం ఆర్కిడ్ పూల తీగలను అద్భుతంగా మేళవించి చిత్రించారు. ప్రకృతి, కళల మధ్య ఉండే అపురూప సమతుల్యతను ఈ చిత్రం ఆవిష్కరించింది. పర్యావరణ పరిరక్షణ, సుసంపన్నమైన జీవ వైవిధ్యానికి అంతర్జాతీయంగా పేరుగాంచిన సెషెల్స్ దేశానికి ఈ బహుమతి ఎంతో ఉచితంగా అమరింది.మహేశ్వరి సిల్క్ స్టోల్, అపురూపమైన బిద్రీవేర్ బాక్స్సెషెల్స్ ప్రథమ మహిళ వెరోనిక్ హెర్మినీకి ప్రధాని మోదీ రెండు విభిన్నమైన హస్తకళాఖండాలను బహూకరించారు. అందులో మొదటిది మధ్యప్రదేశ్‌ హ్యాండ్లూమ్ రంగానికి రత్నదీపమైన మహేశ్వరి సిల్క్ స్టోల్. ఈ వస్త్రం దాని తేలికపాటి పొరలకు, చక్కటి డ్రేపింగ్ శైలికి సాటిలేని మేటి గుర్తింపు సంపాదించింది. కాటన్, పట్టు దారాల కలయికతో తయారు చేసిన ఈ స్టోల్‌లో ఉన్న డిజైన్లు, అంచులు దీనికి జీవం పోశాయి. మహేశ్వరి స్టోల్‌తో పాటు ఆమెకు మరో బహుమతి ఇచ్చారు మోదీ. కర్ణాటక బీదర్ కు చెందిన చారిత్రాత్మక బిద్రీవేర్ బాక్స్ ను బహూకరించారు.