
కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ హీరోయిన్ హనీ రోజ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఒక జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవ వేడుకలో హనీ రోజ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర...
కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ హీరోయిన్ హనీ రోజ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఒక జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవ వేడుకలో హనీ రోజ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తనపై లైంగిక భావనలతో కూడిన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చెమ్మనూర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో, బాబీ చెమ్మనూర్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ, తన వ్యాఖ్యలు హనీ రోజ్‌ను, ఆమె కుటుంబాన్ని బాధపెట్టాయని గ్రహించానని... ఈ ఉదంతానికి పూర్తి బాధ్యత వహిస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ప్రకటించారు. ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే ఆమె తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఈ వివాదంపై గతంలో మాట్లాడిన హనీ రోజ్... తన లుక్స్‌పై వచ్చే సరదా జోకులను, మీమ్స్‌ను తాను కూడా స్పోర్టివ్‌గా తీసుకుంటానని, కానీ ప్రతి దానికి ఒక హద్దు ఉంటుందని స్పష్టం చేశారు. అసభ్యకరమైన, గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను ఏమాత్రం సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. వ్యాపారవేత్త చెమ్మనూర్ చేసిన ఈ బహిరంగ క్షమాపణలపై హనీ రోజ్ ఇంకా స్పందించాల్సి ఉంది.