
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Idupu Kayitham Movie: భాష… భావవ్యక్తీకరణ మాధ్యమం. మానవ పరిణామక్రమంలో ప్రాంతాల వారిగా సందర్భోచితంగా భావాన్ని వ్యక్తీకరించేందుకు, ఆలోచనలను, అనుభవాలను పంచుకోవడానికి వాడే పదసంపద సమాహారమే భాష. ప్రాంతమేదైనా… అక్కడి ప్రజల మధ్య సాగే మాండలిక ఆధారంగా పుట్టుకొచ్చిన మాటలు, పదాల రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. మాటలకే పరిమితంకాదు.. లిఖిత పూర్వక అక్షరాలు, సంకేతాలు, సైగలతో భావాలను వ్యక్తీకరించే శక్తి సామర్థ్యాలు అందులో ఇమిడి ఉంటాయి.
భాషకు మూలం గ్రామీణ ప్రాంతాలే.. ఎక్కడ పుడితే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా భావ వ్యక్తీకరణకు అమ్మనేర్పిన మాటలే.. మాతృ భాషగా నిలిచింది. భాషలు వేరైనా భావాలు ఒక్కటే… దేశమేదైనా అమ్మనేర్పిన భాషే.. బిడ్డకు మాతృ భాషగా పరిగణిస్తారు. తెలుగుభాష చాలా గొప్పదని కవులు, రచయితలు ప్రపంచానికి చాటి చెప్పారు. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించారు. కాలక్రమంలో తెలుగు భాషకు తెగులొచ్చింది. అందుకే తెలుగుభాష మాట్లాడే వారిలో బేధాభిప్రాయాలతో నానారభస చోటుచేసుకుందని అర్థమవుతోంది.
సినిమాను డబ్బింగ్ చేస్తారా? అని వంగ్యాస్త్రం.. మాతృ భాష తెలుగే అయినా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాండలికం ఉంటుంది. వాడుక భాషలో మాటలకు అర్థాలు.. మరొక ప్రాంతంలో ఉన్న వారికి తెలియవు. భాష మూలాలు తెలియని కొందరికి.. మాటల్లో అంతరార్థం… తెలియదని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది. ఇటీవల పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది ‘ ఇడుపు కాయితం’ సినిమా. తాజాగా ఈ సినిమా టైటిల్ పై సామాజిక మాధ్యమాల్లో రాద్ధాంతం జరుగుతోంది. గ్రామీణ భాషాభావానికి అర్థం తెలియని కొందరు.. హేళన భావంతో సోషల్ మీడియాలో పోస్టుచేయడం చర్చనీయాంశమైంది.
భాష పట్ల మక్కువ ఉన్నవారు, భాష అంతరార్థం తెలిసినవారు, కవులు, రచయితలు.. భాషపట్ల అవగాహన లేనివారికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ‘ఇడుపు కాయితం’ సినిమాను సుకుమార్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సినిమా టైటిల్ వెలుగులోకి వచ్చిన తర్వాత మాండలికం చుట్టూ సోషల్ మీడియాలో ప్రాంతీయ వివాదం చోటుచేసుకుంది.
‘ఇడుపు కాయితం’ టైటిల్ పై నెటిజన్ల మధ్య చర్చ..
సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన నెటిజన్ల మధ్య భాషాపరమైన చర్చలు, సంవాదాలు, వివాదాలు చోటుచేసుకున్నాయి. ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ అంతరార్థం తెలియక వెలికి మాటలతో పెట్టిన పోస్టులు వివాదానికి దారి తీశాయి. ఇడుపు అనే పదం.. వదిలించుకోవడం, దూరం చేసుకోవడం అనే అర్థాన్ని సూచిస్తాయి. కాయితం అంటే కాగితమనే అర్థాన్ని సూచిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా భార్యాభర్తలుగా ఉన్న వారు తరచూ గొడవపడేకంటే విడిపోవడమే బెటరని భావిస్తారు. ఇరుకుటుంబాల పెద్దలుసర్థి చెప్పినా… భార్యాభర్తలమధ్య ఆత్మీయత, అనుబంధం కరువైనపుడు కలిసి ఉండేందుకు ఇష్టపడరు. దీంతో ఇరువురి అభిప్రాయాలను తీసుకుని ఇరుకుటుంబాల పెద్దలు, ఆ గ్రామంలో ఉన్నవారితో చర్చించి, సముచిత నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయాన్ని, భార్యభర్తల ఒప్పందాన్ని కాగితం మీద రాసుకుంటారు. ఇద్దరి ఒప్పందాన్ని పెద్దల సమక్షంలో జరిగిందనే విషయాన్ని పదిలపరచుకోడానికి, సాక్ష్యాలతో కాగితంపై రాసుకుంటారు. భార్యాభర్తలుగా విడిపోతున్నామని, ఒకరికొకరికి సంబంధంలేదని, ఇద్దరం భార్యాభర్తల బంధానికి దూరమైపోతున్నామని చేసుకునే ఒప్పందాన్ని ఇపుడు కాయితంగా పరిగణిస్తారు. కోర్టులద్వారా పరిష్కారమైతే విడాకులుగా పరిగణిస్తారు. పెద్దల సమక్షంలో పరిష్కారమైతే ఇడుపుకాయితమని అర్థం. కోర్టుల చుట్టూ తిరిగి ఖర్చులు భరించలేని పేదవర్గాలు సులభంగా, తక్షణ పరిష్కార మార్గంగా పెద్దల సమక్షంలో ఇడుపు కాయితంతో దూరమవుతారు. ఇదీ ఇడుపు కాయితం అంతరార్థం.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ‘ఇడుపు కాయితం’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. కాలగర్భంలో గ్రామీణ మాటలు, పదాలు మరచిపోకూడదని పాతకాలపు మాటలతో ఇడుపుకాయితం పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పదం పక్కా తెలంగాణ మాండలికం కావడంతో, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లకు దీని అర్థం అర్థం కాలేదు. దీంతో ఇడుపుకాయితం సినిమా అర్థమయ్యే విధంగా సబ్ టైటిళ్లతో డబ్బింగ్ చేస్తారా? అనే విధంగా వెటకారపు వ్యాఖ్యలతో కూడిన పోస్టులు తెలంగాణ ప్రాంత భాషా ప్రేమికులకు ఆవేదన కలిగించింది. భాష అర్థం కానపుడు, తెలిసినవారి వద్ద భావాన్ని అర్థంచేసుకోడానికి ప్రయత్నించాలని, సోషల్ మీడియా వేదికగ హేళన చేయవద్దని సుతిమెత్తగా సూచించారు.
నెటిజన్ల మధ్య వాగ్వాదం - తెలంగాణ వాదుల్లో ఆగ్రహం.. రోజులు మారాయి.. కాలం మారింది… ఆధునిక ప్రపంచం వింతపోకడలకు పోతోంది. తెలంగాణలో కుటుంబ బంధాలపై గ్రామీణ నేపథ్యంలో తీసిన ‘బలగం’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకే ఒక పాటద్వారా… కుటుంబ బంధాలను ప్రశ్నించిన తీరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కనెక్టయ్యారు. భాషా భావంతో పాటలో అంతరార్థం, మనుషుల మధ్య బంధాలను గుర్తుచేసింది. బాధ్యతను పెంచింది. మమకార మాధుర్యాన్ని పంచింది. కుటుంబాన్ని ఏకం చేసింది. పాటతో సాగిన సన్నివేశాలు మనుషుల్లో మనసుల్ని కట్టిపడేశాయి. ఇదీ భాషలో అంతరార్థం. ఎవరికైతే అర్థమవుతుందో… వారికి బోధపడుతుంది. బలగం అనే పదంలో అర్థాలను పరిశీలిస్తే… కుటుంబ బంధం, బంధుత్వం, సేన, సైన్యం, పటాలం, గుంపు, దళం అర్థాన్నిస్తాయి. గ్రామీణ నేపథ్యంలో సాగిన సినిమా సన్నివేశాలు ‘బలగం’పేరుతో తీసిన సినిమా బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టింది. కుటుంబ సమేతంగా సినిమా చూసిన వారికి కన్నీళ్లు తెప్పించాయి. భాషభావంతో జనాన్ని కనెక్ట్ చేసింది. అదీ భాషకున్న భావం.
తెలంగాణ మాండలికాన్ని హేళన చేయవద్దని హెచ్చరికలు.. భాష గొప్పతనాన్ని గుర్తించి, అందులో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలనే గానీ, ఎవ్వరూ కించపరిచే విధంగా వ్యవహరించి, అనవసరపు రాద్ధాంతం చేసుకోవద్దని సామాజిక వేత్తలు సూచించారు. ప్రాంతాలు వేరైనా భాషాభావాన్ని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తే జ్ఞాన బోధతో విజ్ఞానం వస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.