
వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.40 లక్షల వ్యయంతో ఫుడ్ సైన్స్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీని ప్రారంభించిన రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ వచ్చే ఏడు సంవత్సరాల్లో దాదాపు 5,000 మంది
విద్యార్థులకు ప్రయోజనం అన్ని దానాలలో విద్య, జ్ఞానదానం అత్యున్నతమైనది: ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, వైస్ ఛాన్సలర్, వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం హైదరాబాద్, జూన్ 29, 2026: నైపుణ్యాధారిత విద్య, శాస్త్రీయ పరిశోధనలకు మరింత బలాన్ని చేకూర్చే దిశగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ (ఆర్సిహెచ్ఈ) ఆధ్వర్యంలో రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఫుడ్ సైన్స్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీని సోమవారం వీరనారి చాకలి ఇలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (వీసీఐడబ్ల్యూయూ)లో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రయోగశాలను విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డా. ఎస్.వి. రామ్ ప్రసాద్, డిస్ట్రిక్ట్ రోటరీ ఫౌండేషన్ చైర్మన్ పీడీజీ కె. ప్రభాకర్** సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ది రోటరీ ఫౌండేషన్ గ్లోబల్ గ్రాంట్ సహకారంతో, అంతర్జాతీయ భాగస్వాములైన రోటరీ క్లబ్ ఆఫ్ కాంటన్ (అమెరికా), రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 6400, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 5810 మద్దతుతో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ అమలు చేసింది. ఎన్ఏబీఎల్ (NABL) గుర్తింపు పొందిన ఈ ఫుడ్ సైన్స్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ విద్యార్థులు, పరిశోధకులు మరియు అధ్యాపకులకు ఆహార పరీక్షలు, ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధన, నాణ్యత నియంత్రణ మరియు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలను అందించనుంది. ఈ ప్రయోగశాలలో నాలుగు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి: ఫుడ్ టెస్టింగ్ & క్వాలిటీ అష్యూరెన్స్ యూనిట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ & ఇన్నోవేషన్ యూనిట్ రీసెర్చ్ & అనాలిసిస్ యూనిట్ ట్రైనింగ్ & స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ఈ సదుపాయం ద్వారా విద్యార్థులు అత్యాధునిక విశ్లేషణ పరికరాలపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందడంతో పాటు, ఆధునిక పరిశోధనలు చేపట్టడం, వినూత్న ఆహార ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ప్రాయోగిక నైపుణ్యాలను అలవరచుకునే అవకాశం పొందుతారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ మాట్లాడుతూ, రోటరీ సంస్థ విశ్వవిద్యాలయానికి నిరంతరం అండగా నిలుస్తూ విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. “భారీ స్థాయిలో శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయాల ఏర్పాటు నుండి ఇప్పుడు రూ.40 లక్షల వ్యయంతో ఫుడ్ సైన్స్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ స్థాపన వరకు, మా ఫుడ్ సైన్స్ కార్యక్రమానికి అవసరమైన సమగ్ర వాతావరణాన్ని రోటరీ కల్పించింది. ఈ ప్రయోగశాల విశ్వవిద్యాలయం ఎన్నో ఏళ్లుగా కలగన్న ఆకాంక్షను సాకారం చేసింది” అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ అధ్యక్షుడు గోవింద్ పుట్టా మాట్లాడుతూ, వృత్తి నైపుణ్యాలు మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించే శిక్షణ కార్యక్రమాలు ఈ ఏడాది తమ క్లబ్ ప్రధాన లక్ష్యంగా పనిచేశాయన్నారు. “ప్రాయోగిక విద్య ద్వారా విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచగల విద్యాసంస్థలను గుర్తించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రోటరీ ఫౌండేషన్ నిధులతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ సైన్స్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ ద్వారా వచ్చే ఏడు సంవత్సరాల్లో సుమారు 5,000 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటు, ఆవిష్కరణలు మరియు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కేంద్రం దోహదపడుతుంది. మా క్లబ్ చేపట్టిన ప్రభావవంతమైన సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇది ఒక మైలురాయి” అని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ మరియు అంతర్జాతీయ భాగస్వాములకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ మాట్లాడుతూ, “పువ్వుకు పరిమళం ఎంత ముఖ్యమో, మానవాళికి సేవ అంత ముఖ్యమైనది. రోటరీ సంస్థ చూపిన నిబద్ధత, సేవాభావం రూ.40 లక్షల కలను సాకారం చేసింది. విశ్వవిద్యాలయం మరియు విద్యార్థుల కలలను వాస్తవ అవకాశాలుగా మార్చింది. అన్ని దానాలలో విద్యా దానం, జ్ఞానదానం అత్యున్నతమైనది. దాదాపు ఇరవై నెలల నిరంతర కృషి అనంతరం ఈ ఫుడ్ సైన్స్ ఇన్నోవేషన్ ల్యాబొరేటరీ రూపుదిద్దుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది యువతులకు ప్రాయోగిక నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు అందించి తరతరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది” అని అన్నారు. కొత్తగా ప్రారంభమైన ఈ ప్రయోగశాల ఫుడ్ సైన్స్ విద్య, పరిశోధన రంగాల్లో అత్యుత్తమ కేంద్రంగా ఎదిగి, విద్యా పురోగతి, పరిశ్రమలతో భాగస్వామ్యం, ఆవిష్కరణలు మరియు సమాజాభివృద్ధికి విశేషంగా దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మీడియా సంప్రదింపులకు: సోలస్ మీడియా డి. రామచంద్రమ్ మొబైల్: 9848042020