
సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) వివాదంలో పాకిస్థాన్ మరోసారి తీవ్రమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగింది. భారత్ కు వ్యతిరేకంగా ఆ దేశ మంత్రులు హెచ్చరికలు జారీ చేశారు.
సింధు నదీ జలాల్లో తమ దేశానికి దక్కాల్సిన వాటాను ఆపాలని చూస్తే ఆ రెండు చేతులను నరికివేస్తామని అన్నారు. గత ఏడాది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ దశాబ్దాల నాటి ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని నిర్ణయించడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది.పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్. దీనిపై తాజాగా వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్, సమాచార శాఖ మంత్రి అత్తావుర్ తరార్ అత్యవసరంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్‌ పై ఆరోపణలు గుప్పించారు.ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో ముసాదిక్ మాలిక్ మాట్లాడారు. పొరుగు దేశ (భారత్) ప్రధాని ట్యాప్ ఆపరేటర్ గా పని చేస్తోన్నారని, పాకిస్తాన్‌ లోనికి ఒక్క చుక్క నీరు కూడా వదలబోనని చెబుతున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు రావాల్సిన సింధు నదీ జలాలను అడ్డుకునే అవకాశం ఎవరికీ ఇవ్వబోమని, దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ లో మెజారిటీ జనాభా వ్యవసాయంపైనే ఆధారపడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.దేశంలో దాదాపు 40 నుంచి 50 శాతం మంది ప్రజల జీవనోపాధి నేరుగా వ్యవసాయ రంగంతో ముడిపడి ఉందని, దీన్ని దెబ్బతీసేలా భారత్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ ఆహార భద్రత, సగం మందికి లభిస్తున్న ఉపాధి అవకాశాలు, 25 శాతం మేర ఉన్న జాతీయ ఆర్థిక వ్యవస్థను భారత్ నియంత్రించాలని చూడటం అన్యాయమని పేర్కొన్నారు. తమ దేశానికి దక్కాల్సిన నీటిని కోల్పోయే పరిస్థితి వస్తే భారత్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పునరుద్ఘాటించారు.ఈ విషయంలో తాము మాటలకే పరిమితం కాబోమని, దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే తీవ్రంగా స్పందిస్తామని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. దిగువ ప్రాంతంలో ఉన్న దేశాల హక్కులను ఎగువ ప్రాంతాల దేశాలు ఏకపక్షంగా నిలిపివేయలేవని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సహజ న్యాయ సూత్రాల ఆధారంగా అంతర్జాతీయ వేదికలపై తమ వాదనను గట్టిగా వినిపిస్తామని ముసాదిక్ మాలిక్ అన్నారు.భారత్- పాక్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం పూర్తిగా చట్టబద్ధమైనదని, దీనిని ఏ ఒక్క దేశం కూడా ఏకపక్షంగా రద్దు చేయడం కానీ, సవరించడం కానీ లేదా నిలిపివేయడం కానీ చేయలేదని మంత్రి అతావుల్లా తరార్ అన్నారు. ఈ విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, దీనికి అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్ గతంలో చేసిన ప్రకటనలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.