
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
31st Edition CII Summit: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్టణం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కానుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్‌లో నిర్వహించనున్నారు. విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ సదస్సు కంటే ముందుగా 5 చోట్ల ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని తెలిపారు. కొత్త ఆలోచనలకు.. అవకాశాలకు సీఐఐ సదస్సు వేదిక కావాలని సూచించారు. ఎంఓయూలు, పెట్టుబడులతో పాటు నాలెడ్జ్ షేరింగ్ మీద ఎక్కువ దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026పై సోమవారం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. విశాఖ భాగస్వామ్య సదస్సు గతానికి భిన్నంగా నిర్వహించాలని ఆదేశించారు. నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే ఈసారి ప్రాంతీయ స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించాలని సూచించారు. Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World థీమ్‌తో 31వ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు.
సీఐఐ సదస్సులో భాగంగా ఎంఓయూలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలతో రెండు రోజుల భాగస్వామ్య సదస్సు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్‌ను ఆహ్వానించాలని చెప్పారు. భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
'విశాఖపట్టణంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు సంబంధించి దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవిదేశాల్లో రోడ్ షోలు చేపట్టాలి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సులకు సంబంధించి రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రధాన భాగస్వామ్య సదస్సుకంటే ముందుగానే విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సదస్సుల్లో ఎంఓయూలు కుదర్చుకునే అంశంపై అధికారులు ఎలాంటి ప్రణాళికలు చేపట్టారని సీఎం ప్రశ్నించగా.. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉంటుందో బేరీజు వేసుకుని.. ఆ మేరకు ఆయా ప్రాంతీయ సదస్సుల్లో ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు.
సదస్సుపై సమీక్ష చేసిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'భాగస్వామ్య సదస్సులు అంటే కేవలం పెట్టుబడులు రాబట్టడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం అనే భావన పోవాలి. భాగస్వామ్య సదస్సుల్లో వివిధ కీలక అంశాలపై చర్చ జరగాలి. ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి? ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నామనే దానికంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత వరకు చేసుకోగలుగుతున్నామనేది ముఖ్యం' అని తెలిపారు.
'విశాఖలో జరగబోయే 31వ భాగస్వామ్య సదస్సులో జరిగే కార్యక్రమాలపై ప్రజలు చర్చించుకోవాలి. వినూత్నంగా ఆయా రంగాలను ఏ విధంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలు రేకేత్తించాలి. టెక్నాలజీ సహా వివిధ అంశాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆయా రంగాల్లో ఛాంపియన్ గా నిలిచిన వాళ్లే గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్నారు. ఫ్యూచరిస్టిక్ రంగాలపై ఎక్కువ దృష్టి సారించాలి' అని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన నిపుణులు భాగస్వామ్య సదస్సుకు వచ్చేలా చూడాలని.. సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఐఐ భాగస్వామ్య సదస్సును వినూత్నంగా నిర్వహించాలని.. ప్రాంతీయ స్థాయిలో భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తే ప్రజలు, యువత, విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుంది. కొత్త ఆలోచనలను ప్రజలకు చేరవేయడం.. యువతలోని ఇన్నోవేషన్లను ఆయా రంగాల పారిశ్రామిక పెద్దల దృష్టికి వెళ్లడం అనేది సాధ్యమవుతుంది' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాంతాల వారీగా నిర్వహించే సదస్సుల్లో స్టార్టప్ కంపెనీలకు, ఇన్నోవేషన్లకు అగ్రభాగం ఉండాలి. ప్రాంతీయ సదస్సుల్లోనూ ఎంఓయూలు కుదుర్చుకునే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒక్క చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగితే... ప్రభుత్వం చేస్తున్న కృషి.. పడుతున్న కష్టం ప్రజలకు అర్థమవుతుంది' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.