ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టబడుల వేటలో ఉంది.. రాష్ట్రానికి కంపెనీలు, పరిశ్రమల్ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు. గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు వరుసగా కంపెనీలు క్యూ కట్టాయి.
తాజాగా మరో ప్రముఖ కంపెనీ అడిడాస్ సంస్థకు షూస్ తయారు చేసి సరఫరా చేసే హ్వాసెంగ్ ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హ్వాసెంగ్ అడిడాస్‌కు షూస్ సప్లై చేయడంలో మెయిన్ పార్ట్నర్గా ఉంది. హ్వాసెంగ్‌కు ప్రస్తుతం చైనా, వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, ఇండోనేషియాలో యూనిట్లు ఉన్నాయి. ఆ ఐదు దేశాల తర్వాత భారత్‌లో, అందులోనూ ఏపీలో తొలి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వాస్తవానికి హ్వాసెంగ్ దేశంలో తొలి యూనిట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుందనే చర్చ జరిగింది. తమిళనాడు ప్రభుత్వం అక్కడ యూనిట్ ఏర్పాటయ్యేలా ప్రయత్నాలు చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతేడాది ఆగస్టు నెలలో షూస్ ప్లాంటు (నాన్-లెదర్ స్పోర్ట్స్) తూత్తుకుడి జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుని.. దీనికి అవసరమైన ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇంతలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ, ఇక్కడి సింగిల్ డెస్క్ విధానం, రాయితీలు, వేగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇస్తున్నారని తెలిసింది. ఏపీ ప్రభుత్వం కూడా తమ వైపు నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది.. హ్వాసెంగ్ కంపెనీతో సంప్రదింపులు జరిపారు. ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి.. రాష్ట్రంలో పెట్టుబడికి హ్వాసెంగ్ కంపెనీ అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరగా.. హ్వాసెంగ్ కంపెనీ ఓకే చెప్పింది. కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో ఈ యూనిట్ ఏర్పాటుకు 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. హ్వాసెంగ్ కంపెనీ ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా మూడు విడతల్లో రూ.896 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో 17,465మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.. అందులోనూ మహిళలకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి అంటున్నారు. కుప్పంలో ఏర్పాటు చేయబోయే హ్వాసెంగ్ యూనిట్ నుంచి ఏడాదికి 20 లక్షల జతల షూస్ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ నెల 3 లేదా 4న యూనిట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, హ్వాసెంగ్ ప్రతినిధులు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.ఏపీ సీఎం చంద్రబాబు జులై 1 నుంచి 5 వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. జులై 1న నెల్లూరు జిల్లాలో పర్యటించి పింఛన్లు పంపిణీ చేస్తారు. అదే రోజు తిరుపతి జిల్లా శ్రీసిటీలో హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. జులై 2నతిరుపతి జిల్లా రైల్వేకోడూరులో నిర్వహిస్తున్న వీబీ జీ రామ్‌జీ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతిలో జీఎస్డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపునకు హాజరవుతారు. జులై 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వెళతారు.. ఈ నెల 3 నుంచి 5 వరకు పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.