
దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ.. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి చేపట్టిన ధర్నాలో పాల్గొని రాష్ట్ర...
దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ..
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దిల్సుఖ్నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి చేపట్టిన ధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, జాబ్ క్యాలెండర్ అమలు, ఏజ్ రిలాక్సేషన్ వంటి డిమాండ్లతో ఆందోళన చేపట్టిన నిరుద్యోగులకు ఆమె సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు వారి వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. దిల్సుఖ్నగర్లో ఉద్యమం చేస్తున్న నిరుద్యోగ యువతను అభినందిస్తూ, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతతో ఆటలాడుతోందని, నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీలో 19 వేలకుపైగా కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించిందని, డీజీపీ కూడా అదే విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. తాము సభలో ప్రశ్నించినప్పుడు కూడా 19 వేలకుపైగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడు మాత్రం మాట తప్పి కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. 5 వేలు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కానిస్టేబుల్ నియామకాల విషయంలో నిరుద్యోగులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, తాను చేపట్టిన ఏ ఉద్యమాన్నైనా పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టనని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో తాను కూడా కీలకంగా పోరాడిన వారిలో ఒకరినని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న మహిళల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.
19 వేలకుపైగా ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం సరికాదని, అదే విషయం అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదా అని ప్రశ్నించారు. గతంలో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ జీవో తీసుకొచ్చి, ఇప్పుడు దానిని వెనక్కి తీసుకోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 36 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 11 వేల ఉద్యోగాలే భర్తీ చేసిందని ఆరోపించారు.
మరోవైపు రూ.7 వేల కోట్లతో మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్న ప్రభుత్వం, పేదల ఇళ్లను తొలగిస్తూ ఆ ప్రాజెక్టును ఎందుకు అమలు చేస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి "బిడ్డా రేవంత్ రెడ్డి.. నిరుద్యోగులతో పెట్టుకుంటున్నావ్.. నిన్ను గద్దె దించే వరకు వాళ్లు వదిలిపెట్టరు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు. 5 వేలు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. జఫ్పా ప్రభుత్వం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జూలై 2న నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారని, అదే రోజు ఉద్యమకారులతో నిర్వహించే భూపోరాట కార్యక్రమం అనంతరం అవసరమైతే నిరుద్యోగుల ఉద్యమంలోనూ పాల్గొంటామని ప్రకటించారు. నిరుద్యోగులు ఒంటరివారు కాదని, ఉద్యమకారులు, తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అందరూ వారికి అండగా నిలుస్తారని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆమె విమర్శించారు.
కష్టపడి చదవండి.. మీ కలల బాధ్యత నాది.. మంత్రి లోకేశ్ అభయం!
.