
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఆయన చేతి కండరాలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే సర్జరీ చేయాలని సూచించారు.
అయితే, రాష్ట్రానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు, పరిపాలనా విధులు పూర్తయిన తర్వాతే తాను శస్త్రచికిత్స చేయించుకుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం నాడు తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆయన రెండు భుజాలను క్షుణ్ణంగా పరీక్షించిన వైద్య బృందం, రొటేటర్ కఫ్‌తో పాటు చేతికి సంబంధించిన రెండు కండరాలకు తీవ్ర గాయమైనట్టు గుర్తించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నందున, తక్షణమే శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయనకు పూర్తి నివేదికను అందజేశారు.అయితే, వైద్యుల సూచనపై స్పందించిన పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రభుత్వ కార్యక్రమాలను, పరిపాలనా బాధ్యతలను పూర్తి చేయడం తన కర్తవ్యమని ఆయన భావించారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాతే శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరతానని తెలిపారు. ఈ మేరకు అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి వస్తానని ఆయన పేర్కొన్నారు.కాగా, పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా చేతి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రెండు చేతుల కండరాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు, రొటేటర్ కఫ్ గాయంతో ఆయన అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ నొప్పి ఆయన్ను వేధించింది.