రాష్ట్రంలో సోమవారం రోజున భారీగా పోలీసుల ట్రాన్స్ఫర్లు జరిగాయి. ఇప్పటికే ఒకేసారి 36 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌లు, బదిలీలు జరగ్గా.. తాజాగా ఐపీఎస్ అధికారులకు కూడా స్థానచలనం కల్పిస్తూ..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు వెలువరించారు. ఈ క్రమంలోనే జోనల్ డీఐజీలకు అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. మరోవైపు.. సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కీలక పోస్టింగ్‌లను రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు కీలక ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించడంతో పాటు.. ఇంకొందరు ఐపీఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది.ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్. శ్వేతను.. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేశారు. దీంతో పాటు ఆమెకు మల్టీజోన్ పరిధిలోని డీఐజీ (జోన్-4, భద్రాద్రి) పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక ఇప్పటివరకు వరంగల్ సీపీగా ఉన్న సన్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. అదనంగా ఆయనకు డీఐజీ (జోన్-3, రాజన్న) బాధ్యతలను కూడా కల్పించారు. అదే సమయంలో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్‌కు హైదరాబాద్ నార్త్ రేంజ్ (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంబర్ కిశోర్ ఝాకు అదనంగా డీఐజీ (జోన్-1, కాళేశ్వరం) బాధ్యతలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పగించింది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ డీఐజీ (జోన్-5, యాదాద్రి)గా.. ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీ ఆర్. భాస్కరన్ డీఐజీ (జోన్-2, బాసర)గా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.మరోవైపు.. తెలంగాణ ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న చి. సింధు శర్మను హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా బదిలీ చేశారు. అంతేకాకుండా ఎస్పీ (ఎస్ఐబీ)గా కూడా సింధు శర్మ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్ఐబీ ఎస్పీగా ఉన్న వై. సాయి శేఖర్‌ను.. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించారు. హైదరాబాద్ సిటీ డీసీపీగా ఉన్న చెర్నూరి రూపేష్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న చి. ప్రవీణ్ కుమార్‌లు.. సీఐడీ ఎస్పీలుగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక వెయిటింగ్లో ఉండి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును హైదరాబాద్ సిటీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీగా నియమించారు. ఈ క్రమంలోనే గతంలో ఆయనను సీఐడీ ఎస్పీగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఇక వనపర్తి అదనపు ఎస్పీగా ఉన్న రాజేష్ మీనాను వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా ట్రాన్స్ఫర్ చేయగా.. వికారాబాద్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న బి. రాములు నాయక్‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది.