
అమరావతి: దేశం గర్వించేలా అమరావతి (Amaravati)ని నిర్మిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.
నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు సీఎంకు తెలిపారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ఫ్రా సహా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లలాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.
పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140 భారీ యంత్రాలు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్టు సీఎంకు మంత్రి నారాయణ వివరించారు. భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పని చేశామన్న బ్రాండ్‌ను కాంట్రాక్టర్లు సంపాదించేలా పనులు చేపట్టాలని సీఎం సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు.
కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. పనులు పూర్తయ్యాక రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యతపై ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలన్నారు. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ, బీఎస్ఆర్, కేఎంవీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు చేపట్టిన పనులకు సంబంధించిన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.