
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
HYDRAA Operation: జలాశయాల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడం ప్రాధాన్యంగా తీసుకున్న హైడ్రా మరోసారి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించి ప్రజాధనాన్ని హైడ్రా కాపాడింది. అయితే పేదల ఇళ్లను కూల్చారని.. పేదలను నిరాశ్రయులను చేశారని కొందరు చేస్తున్న ప్రకటనలను హైడ్రా ఖండించింది. హైదరాబాద్‌లోని హస్మత్‌పేటలో కబ్జాకు గురయిన భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది.
వాస్తవం ఇదే హస్మత్‌పేటలో పేదల ఇళ్లను కూల్చేసిందంటూ కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం, రాజకీయ ప్రేరేపితం అని హైడ్రా ప్రకటన చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించి.. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప దీనిలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టతనిచ్చింది. విమర్శలు చేసే ముందు అసలు అక్కడ ఏం జరిగిందో.. వాస్తవాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హైడ్రా గుర్తుచేసింది. ఈ సందర్భంగా పూర్తి వివరాలను హైడ్రా వెల్లడించింది.
అసలు ఏం జరిగిందంటే? హస్మత్‌పేట సర్వే నంబర్-1లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి దశాబ్దాలుగా కబ్జాకోరల్లో చిక్కుకుపోయింద. ఆక్రమణల కారణంగా ఇప్పటికే ఆ భూమిలో 98 ఎకరాలు కబ్జాకోరుల పాలైంది. కబ్జాకు గురయిన భూమి కాకుండా ప్రభుత్వానికి 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ పది ఎకరాలను కాపాడి.. భవిష్యత్ తరాల ప్రజా అవసరాలకు ఉపయోగించాలనే ఉద్దేశంతోనే హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.
రెవెన్యూ శాఖ లేఖ ఆధారంగా ఆ భూమి పరిరక్షణ కోసం హైడ్రా ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న ఏ ఒక్క శాశ్వత ఇంటి జోలికి కూడా వెళ్లలేదు. జీవో నెం.58, 59 కింద క్రమబద్ధీకరణ (రెగ్యులరైజ్) అయిన ఇళ్లను కూల్చేశారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. రెవెన్యూ శాఖ అధికారుల లేఖ ఆధారంగా.. వారి సమక్షంలోనే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆపరేషన్ నిర్వహించి ప్రభుత్వ భూమిని పరిరక్షించినట్లు హైడ్రా వెల్లడించింది. ప్రభుత్వ భూమిపై కొత్తగా వేసిన ప్రీకాస్ట్ గోడలు, తాత్కాలిక షెడ్లు, అక్రమ కంచెలు, ప్లాట్లుగా విభజించేందుకు చేసిన ఏర్పాట్లను మాత్రమే తొలగించినట్లు హైడ్రా వివరించింది.
ఎలాంటి రాజకీయ కోణం లేదు ఈ ఆపరేషన్ హైడ్రా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదని.. రెవెన్యూ శాఖ అధికారుల లిఖితపూర్వక విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ అని హైడ్రా తెలిపింది. తాము చేసిన ఆపరేషన్ చట్టబద్ధమైన పరిపాలనా చర్య మాత్రమేనని.. దీనిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జా చెర నుంచి విడిపించిన పదెకరాల ప్రభుత్వ భూమి విలువ బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.750 కోట్లు ఉంటుందని హైడ్రా తెలిపింది.
స్వార్థ రాజకీయ ప్రచారాలు ఇంత విలువైన ప్రభుత్వ ఆస్తి కూడా కబ్జాకు గురైతే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, రోడ్ల వంటి ప్రజా అవసరాల కోసం భూమి ఎక్కడి నుంచి వస్తాయని హైడ్రా ప్రశ్నిస్తోంది. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని హైడ్రా వివరణ ఇచ్చింది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తే దానిని రాజకీయ కోణంలో చూడటం ఎంతవరకు సమంజసం? అని తప్పుడు ప్రచారం చేస్తున్న వారి తీరును ఖండించింది. ప్రభుత్వ భూములు అంటే అవి ప్రతి పౌరుడి ఆస్తి అని గుర్తుచేసింది. హస్మత్‌పేటలో జరిగింది పేదల ఇళ్ల కూల్చివేత కాదు.. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ కబ్జాలకు చెక్ పెడుతూ రూ.750 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని రక్షించిన సాహసోపేతమైన చర్య అని హైడ్రా వెల్లడించింది. దీనిపై కొందరి స్వార్థ రాజకీయ ప్రచారాలు ప్రజలెవరూ కూడా నమ్మకుండా, వాస్తవాలను గ్రహించాలని హైడ్రా సూచించింది.