Turtlemnint Fintech IPO: ఇన్సూరెన్స్ సెక్టార్లోని స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీ టర్టిల్ మింట్ ఫిన్టెక్ సొల్యూషన్ (Turtlemint Fintech) షేర్లు నిరాశపరిచాయి.
జూన్ 29వ తేదీ సోమవారం రోజున ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే, భారీ నష్టాల్లో అడుగు పెట్టడంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. ఇష్యూ ధర రూ. 152 తో పోలిస్తే దాదాపు 11 శాతం తక్కువ ధరతో ఈ షేర్లు నమోదవడం నిరాశకు గురిచేసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ కంపెనీ షేరు రూ. 136.20 వద్ద లిస్టింగ్ కాగా ఆపైన మరింత పడిపోయింది. ఒక దశలో 13 శాతం మేర నష్టపోయి రూ. 132.15 స్థాయికి దిగజారియంది. దీంతో ఇన్వెస్టర్లుక భారీ నష్టాలు వచ్చినట్లయింది. మరోవైపు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈలోనూ ఈ షేర్లు దాదాపు 11.25 శాతం నష్టంతో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. రూ. 134.90 వద్ద లిస్టింగ్ అయ్యాయి. జూన్ 19వ తేదీన మొదలైన ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ జూన్ 23వ తేదీతో ముగిసింది. అయితే, ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అంతగా స్పందన రాలేదు. చివరి రోజు నాటికి కేవలం 1.20 రెట్ల సబ్స్క్రిప్షన్ మాత్రమే రావడం గమనార్హం. ప్రస్తుతం టర్టిల్ మింట్ ఫిన్టెక్ కంపెనీ మార్కెట్ వాల్యూ రూ. 4069.70 కోట్లుగా ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 883 కోట్లు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 144- 152గా నిర్ణయించారు. మార్కెట్లోకి ఈ కంపెనీ షేర్లు నిరాశాజనకమైన రీతిలో ప్రవేశించాయి. కంపెనీ ఆర్థిక పునాదులు సవాలుతో కూడుకున్నవిగానే ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది ఇంకా నష్టాల్లోనే కొనసాగుతూ -47.29 శాతం నెగటివ్ RoNW (నికర విలువపై రాబడి)ని నమోదు చేస్తోదంని పేర్కొంటున్నారు. నిరంతర నష్టాలు ఉన్నప్పటికీ FY25 ఆదాయానికి దాదాపు 6.8 రెట్ల వాల్యుయేషన్ (విలువ) కట్టడం అనేది అధికంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. కంపెనీ ఆదాయం విషయంలోనూ అనిశ్చితి నెలకొందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. FY24లో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 81 శాతం క్షీణించింది. మొత్తం ఖర్చులలో డిజిటల్ పార్టనర్ ఖర్చులు 70– 77 శాతం వాటా కలిగి ఉండటంతో లాభదాయకత అనేది ప్రధానంగా వ్యాపార విస్తరణ (స్కేల్) సాధించడంపైనే ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలంలో కంపెనీ పనితీరు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చన్న అంచనాలతో మదుపరుల నుంచి ఆసక్తి లభించలేదని తెలుస్తోంది.