
భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి పాక్ వ్యక్తి పట్టుబడ్డాడు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో మరో పాకిస్థానీ పౌరుడు భారత భద్రతా బలగాల కంటపడ్డాడు. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడంతో భారత సైన్యం అప్రమత్తమైంది.
అధికారుల వివరాల ప్రకారం.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని హవేలీ జిల్లాకు చెందిన రయీస్ ఖాన్(31) ఆదివారం బాలాకోట్ సెక్టార్లో ఎల్ఓసీ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. గమనించిన భారత సైనికులు.. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనిఖీలు నిర్వహించగా.. అతడి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. అతను ఉద్దేశపూర్వకంగానే చొరబాటుకు యత్నించాడా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
కాగా.. అంతకముందు శుక్రవారం కూడా పీఓకేకు చెందిన మొహమ్మద్ సజాద్(26) అనే వ్యక్తి పూంచ్ సమీపంలోని గుల్పూర్ ప్రాంతంలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతణ్ని పోలీసులకు అప్పగించింది సైన్యం. జూన్ 9న ఎల్ఓసీ దాటి వచ్చిన జావిద్ అలీ(14) అనే బాలుణ్ని కూడా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని వారం రోజుల తర్వాత పాక్‌కు అప్పగించాయి.
నేను మనిషిని.. నాకు రెక్కలు లేవు: ఉద్ధవ్‌కు ఫడణవీస్ కౌంటర్
బంగారం కొనుగోళ్లు తగ్గించినందుకు థాంక్స్