
పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరీతో ఫోన్లో మాట్లాడినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర పుణెకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు అరగంట ముందు సియా గోయల్.. తన ప్రియుడు చేతన్ చౌదరీకి ఫోన్ చేసి రహస్యంగా మాట్లాడినట్టు కాల్ డీటెయిల్ రికార్డ్స్(CDR) ఆధారంగా అధికారులు కనుగొన్నారు. మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ విశ్లేషణ, సీడీఆర్ పరిశీలనలో ఈ విషయం బయటపడినట్టు తెలిపారు.
ఈ కాల్‌ను కుట్రకు సంబంధించిన అత్యంత కీలక డిజిటల్ ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ సంభాషణలో కేతన్‌తో తానున్న ప్రాపర్ లొకేషన్‌ను ప్రియుడు చేతన్‌కు సియా తెలిపిందని, అక్కడ ఇతర పర్యాటకులెవరూ లేరని నిర్ధారించినట్లు అనుమానిస్తున్నారు. హత్యకు సంబంధించిన ప్రణాళికను దాచిపెట్టేందుకు మూడు నెలలుగా ఇరువురూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా షేర్ చేసుకున్న మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ వివరాలను తొలగించినట్లు అధికారులు గుర్తించారు. సదరు డేటాను సైబర్ నిపుణుల సాయంతో వెలికితీసేందుకు యత్నిస్తున్నట్టు తెలిపారు. తొలగించిన సమాచారం, లొకేషన్ వివరాలు, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్‌లను పోల్చి చూసి.. ఈ కుట్రను నిరూపించే దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్టు స్పష్టం చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. కేతన్, సియాలకు నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. కానీ ఈ పెళ్లి తనకు ఇష్టం లేకపోవడంతో సియా.. జూన్ 18న లోహగడ్ కోటకు కేతన్‌ను తీసుకెళ్లి కొండపై నుంచి తోసి హతమార్చింది. ఈ కేసులో ఆమె ప్రియుడు చేతన్ చౌదరీ కూడా నిందితుడిగా ఉన్నాడు. కాగా.. మే నెలాఖరులోనే సియా ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. జూన్ 14న తొలిసారి కేతన్‌ను కొండపై నుంచి తోసేందుకు యత్నించగా.. అదృష్టవశాత్తూ కేతన్ తనను తాను కాపాడుకుని ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు. ఆ సమయంలో పాము కనిపించడంతో అనుకోకుండా అలా జరిగిందని సియా కట్టుకథ అల్లినట్టు చెప్పారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈ నెల 18న రెండోసారి పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్లాన్‌లో కేతన్ తప్పించుకోకుండా ఉండేందుకు చేతన్ కూడా వారిని వెంబడించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. గోయల్, చౌదరీల ఫోన్లను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం ఈ విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది.
భారత్-పాక్ సరిహద్దుల్లో మరో పాక్ వ్యక్తి అరెస్ట్
విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..