
‘సైలెంట్ బ్లాక్బస్టర్’గా చరిత్ర సృష్టించిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ‘అబ్సెషన్’. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న బడ్జెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిర్మాతలకు...
‘సైలెంట్ బ్లాక్బస్టర్’గా చరిత్ర సృష్టించిన హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ‘అబ్సెషన్’. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చిన్న బడ్జెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. థియేటర్లలో భయపెట్టిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్ఫామ్ యాపిల్ టీవీ వేదికగా రేపటి నుంచి అంటే జూన్ 30 నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
రూ. 7 కోట్ల అత్యల్ప బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం.. ఒక్క మన దేశంలోనే ఏకంగా రూ. 77 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకు భారత్లో విడుదలైన హాలీవుడ్ చిత్రాలన్నింటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘అబ్సెషన్’ రికార్డు సృష్టించింది.
సినిమా కథ ఏమిటంటే... బారోన్ అలియాస్ బేర్ (మైఖేల్ జాన్స్టన్) ఒక సాధారణ మ్యూజిక్ స్టోర్ ఉద్యోగి. తన స్నేహితురాలు నిక్కీ ఫ్రీమెన్ (ఇండీ నవరెట్టే) ను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ.. ఆమె తన ప్రేమను అంగీకరిస్తుందో? లేదో? అనే భయంతో తన మనసులోని ప్రేమను ఆమెకు చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో కోర్కెలు నెరవేర్చే ఒక వింత ‘మాయా స్టిక్’ (Magic Stick)ను కొంటాడు. ఆ స్టిక్ ను విరగ్గొట్టి మనసులో ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. బేర్ దాన్ని విరగ్గొట్టి.. ‘ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిక్కీ నన్నే ప్రేమించాలి’ అని కోరుకుంటాడు.
ఆ మ్యాజిక్ స్టిక్ ప్రభావంతో నిక్కీ నిజంగానే బేర్ తో విపరీతమైన ప్రేమలో పడిపోతుంది. మొదట్లో అంతా హ్యాపీగా సాగినా... రోజులు గడిచే కొద్దీ ఆమె ప్రేమ ‘అబ్సెషన్’ (ఒక రకమైన పిచ్చి)గా మారుతుంది. బేర్ కోసం నిక్కీ ఏ స్థాయి దారుణాలకైనా తెగించే సైకోలా ఎలా మారింది? చివరికి ఇద్దరూ ఏమవుతారనేదే ఈ సినిమా కథాంశం.