
దేశంలో సైబర్ నేరాల్లో 29.86% ఇక్కడే ఆకాశంలో క్రైమ్‌రేట్.. అభియోగాల నమోదులో అధమం ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలో నమోదైన సైబర్ నేరాల్లో ఆర్థిక మోసాల కోణంలో జరిగినవి 73,624 కేసులు.
అందులో ఒక్క తెలంగాణాలోనే నమోదైనవి 21,987. అంటే మన రాష్ట్రంలోనే 29.86% ఆర్థిక నేరాలు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కంబోడియా, మయన్మార్, లావోస్ దేశాల్లో అడ్డాలు ఏర్పరచుకొని మోసగిస్తున్న చైనా ముఠాలతోపాటు ఉత్తరాది సైబర్ నేరస్థుల కన్ను తెలంగాణాపై పడటంతో నాలుగేళ్లుగా ఆన్లైన్ ద్వారా డబ్బులు పోగొట్టుకునే బాధితుల సంఖ్య రాష్ట్రంలో అత్యధికంగా ఉంది.
2024లో దేశవ్యాప్తంగా మొత్తం 101,118 సైబర్ నేరాలు నమోదైతే.. రాష్ట్రంలో వాటి సంఖ్య 27,230. అంటే తెలంగాణ వాటానే 27%. రాష్ట్రంలో రోజుకు సగటున 75 సైబర్ నేరాల కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక(21,993) రెండోస్థానంలో ఉంది. సైబర్ నేరాల్లో ఆర్థిక మోసాల బారిన పడుతున్న బాధితుల్లో తెలంగాణ వాసులు దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు సైబర్ నేరగాళ్ల ముఠాలు తెలంగాణ వాసుల్నే లక్ష్యంగా చేసుకొని ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటే.. మరోవైపు అభియోగాల నమోదు రేటు అధమ స్థానంలో ఉండటం విస్తుగొలుపుతోంది. జనాభా ఆధారంగా రాష్ట్రంలో క్రైమ్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఏకంగా 71.1గా నమోదు అయింది. రెండోస్థానంలో ఉన్న కర్ణాటకలో అది 32.2. దేశవ్యాప్త సగటు 7.4 మాత్రమే. రాష్ట్రంలో సైబర్ నేరాల తీవ్రత విషయంలో పోలీస్‌శాఖ వాదన మరోలా ఉంది. తమకు అందుతున్న ప్రతీ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తుండటంతోనే కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని చెబుతోంది. ఏదేమైనా కేసుల నమోదులో ప్రథమ స్థానంలో ఉన్న తెలంగాణా పోలీసులు అభియోగపత్రాల నమోదు రేటులో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. తెలంగాణాలో ఈ సగటు కేవలం 16.2 కాగా.. దేశవ్యాప్త సగటు ఏకంగా 31.6గా ఉంది.
సైబర్ నేరాల్లో ఆర్థికమోసాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టొద్దు. వాట్సప్, ఫేస్‌బుక్‌లకు వచ్చే లింకుల్ని క్లిక్ చేసి మోసపోవద్దు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థల ముసుగు వేసుకున్న మోసగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ అంటూ ఆన్లైన్లో పాల్పడే బెదిరింపులకు భయపడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును బదిలీ చేయొద్దు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. సామాజిక మాధ్యమ ఖాతాలకు తెలిసిన వ్యక్తుల నుంచి డబ్బులు పంపాలంటూ రిక్వెస్ట్ వచ్చిందంటే అది మోసమే. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటే తక్షణమే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.