మీకు సమకాలీన రాజకీయ పరిణామాలపై అవగాహన ఉందా.. సామాజిక అంశాలపై స్పృహ ఉందా.. పాలనాపరమైన విషయాలపై పట్టు ఉందా.. అలాంటి వారికి జనసేన పార్టీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. కంటెంట్ రైటర్లు ఛాన్స్ ఇస్తోంది.
సమకాలీన సామాజిక, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండి, తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలలో రాయగలిగే వారికి కంటెట్ రైటర్లుగా అవకాశం కల్పిస్తున్నట్లు.. జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా భాషలలో రాయగలిగి, కంటెంట్ రూపొదించాలనే ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తమకు ఆసక్తి, పట్టు ఉన్న అంశాలపై కంటెంట్ రూపొందించవచ్చని జనసేన పార్టీ ప్రకటనలో వెల్లడించింది.జనసేన పార్టీలోని మీడియా, సోషల్ మీడియాలో విభాగాలతో కలిసి పనిచేస్తూ కంటెంట్ రైటర్లుగా సేవలు అందించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. మరోవైపు కంటెంట్ రైటర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలిచిన వారు జూలై ఐదో తేదీలోపు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. Centraloperations @janasenaparty.org మెయిల్‌కు దరఖాస్తులను మెయిల్ చేయాలని సూచించింది. అలాగే దరఖాస్తు చేసేవారు తమ బయోడేటా వివరాలతో పాటుగా ఏదైనా సమకాలీన రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలపై వ్యాసం రాసి పంపాలని సూచించింది. 200 పదాలకు మించకుండా ఈ వ్యాసం ఉండాలని ప్రకటనలో వెల్లడించింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది.మరోవైపు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. యువత నుంచి పెద్ద వయస్కుల వరకూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సిద్ధాంతాలను, విధానాలను వారికి చేరువ చేసేందుకు సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకోవాలని జనసేన భావిస్తోంది. సోషల్ మీడియా కంటెంట్ ద్వారా జనసేన వైపు ఆకర్షించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కంటెంట్ రైటర్లను నియమించుకునే పనిలో ఉంది జనసేన పార్టీ. సమకాలీన అంశాలతో పాటు ప్రత్యర్థులపై కౌంటర్లు వేసేందుకు ఈ కంటెంట్ రైటర్ల సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది.