CM Revanth Reddy Nalgonda Speech : పదేళ్ల పాటు అధికార పదవులు అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్...
CM Revanth Reddy Nalgonda Speech : పదేళ్ల పాటు అధికార పదవులు అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వందలాది మంది అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబమే అనుభవించిందని విమర్శించారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం.. స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ కామెట్లు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ విజయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే.. వాళ్లకు కడుపు మంట!పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు ఫామ్‌హౌస్‌లు కట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప.. పేదవాడికి సొంత ఇల్లు కట్టించాలనే ఆలోచన చేయలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. "ఈరోజు గ్రామగ్రామాన అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతోంది" అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలోనే రైతుల ఖాతాల్లో రూ.1.56 లక్షల కోట్లు జమ చేశామని, ఏడాదికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తూ పేద ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. కేంద్రం నుంచి యూరియా సరఫరాలో సహాయ నిరాకరణ ఎదురైనా.. తాము కష్టపడి తెప్పించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అందుకే నేడు ధాన్యపు దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని గర్వంగా ప్రకటించారు.30 నెలల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం..!యువతకు ఉపాధి కల్పనలో తమ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం తెలిపారు. కేవలం 30 నెలల స్వల్ప వ్యవధిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి చరిత్ర సృష్టించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టామని, తాము చూపిన ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ జనగణనతో పాటు కులగణన చేయడానికి అంగీకరించిందని గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నల్గొండ జిల్లా పోషించిన పాత్ర అద్వితీయమైనదన్న సీఎం.. నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ లాగే, మలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని కొనియాడారు. కేసీఆర్ నేతలు కేవలం ప్రచారానికే పరిమితం అయ్యారని.. ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి వంటి అమరవీరుల త్యాగాలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుందని మండిపడ్డారు.ఎవరు అడ్డువచ్చినా మూసీ ప్రక్షాళన ఆగేదే లేదు!నల్గొండ జిల్లా ప్రజల పాలిట శాపంగా మారిన మూసీ నది కాలుష్యాన్ని తుడిచి పెట్టడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. మూసీని శుద్ధి చేసి ఇక్కడి ప్రజలకు మేలు చేస్తుంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు రాజకీయం కోసం దాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "గత ప్రభుత్వంలో ఫామ్‌హౌస్‌లలో మెషిన్లు పెట్టుకుని భార్యాభర్తల ఫోన్లు కూడా దొంగచాటుగా విన్నారు. ఆ పాపాల భైరవుడు మళ్లీ అధికారంలోకి రావాలని కొందరు తిరుగుతున్నారు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలి మూలన పడిందని, వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన ఎస్ఎల్బీసీని కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల లోపే ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి నల్గొండకు నీరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు మధ్య బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.