
ఇంటర్నెట్‌డెస్క్: ప్రతి దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. విజువల్స్‌ను గ్రాండియర్‌గా చూపిస్తూ, ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli).
ఇక జక్కన్న యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ను దట్టిస్తూనే బలమైన ఎమోషన్‌తో సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయగలరు. మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’. ఇప్పుడు ఈ సినిమా విషయంలో అదే కోర్పాయింట్గా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే వెల్లడించారు.
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ ఇలా అనేక అంశాలను జోడించి ‘వారణాసి’ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు టైటిల్ గ్లింప్స్‌లో చెప్పకనే చెప్పారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న ఆయన ‘వారణాసి’ మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
‘‘ఆఫ్రికా అడవుల్లోని జంతువుల క్రూరత్వం, అంటార్కిటికాలోని మంచు పర్వతాల చల్లదనం, రామాయణంలోని పాత్రలు, ప్రకృతి విలయాలు, ఫాంటసీతో ముంచెత్తే అద్భుత విన్యాసాలు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. వీటన్నింటి కంటే తండ్రీకొడుకుల మధ్య ఉండే బంధం, భావోద్వేగాలు ఈ కథకు మూలం. అక్కడి నుంచే అసలు ఫాంటసీ మొదలవుతుంది’’ అని తెలిపారు.
ఈ చిత్రంలో మహేశ్‌బాబుతో పాటు, ప్రకాశ్‌రాజ్ (prakash raj in varanasi) కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి తండ్రి ఆశయాన్ని, లేదా లక్ష్యాన్ని సాధించడానికి రుద్ర (మహేశ్‌బాబు) ఏం చేశాడన్నది కథగా ఉండబోతోంది. తండ్రి కోసం ఓ కొడుకు కాలాన్ని దాటి ప్రయాణం చేసే కథతో దీన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. మరి జక్కన్న ‘వారణాసి’లో ఏం చెప్పబోతున్నారో తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ (varanasi movie release date) తేదీ వరకూ వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేసినట్లు రాజమౌళి తెలిపారు. అక్టోబరు నాటికి మొత్తం షూటింగ్ పూర్తవుతుందని వెల్లడించారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.