
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ఎస్.ఎస్. రాజమౌళి(S.S Rajamouli) కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం వారణాసి (Varanasi).
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో అదరగొట్టింది.
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ఎస్.ఎస్. రాజమౌళి(S.S Rajamouli) కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం వారణాసి (Varanasi). ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో అదరగొట్టింది. ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్తా అయినా నిమిషాల్లో వైరల్ గా మారుతోంది. తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన ఒక మీడియా ఇంటరాక్షన్‌లో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సరికొత్త ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడంతో అభిమానుల్లో హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఇప్పటివరకు వారణాసి అంటే కేవలం ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని మాత్రమే ప్రపంచమంతా భావించినప్పటికీ, ఈ కథకు అసలైన ఊపిరి కేవలం యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే కాదని, తండ్రీ-కొడుకుల మధ్య సాగే బలమైన భావోద్వేగాలే అని రాజమౌళి చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లొకేషన్లు తిరిగినా, ఎంతటి విజువల్ ఎఫెక్ట్స్ వాడినా, థియేటర్లలో ప్రేక్షకుడి గుండెను కదిలించేది మాత్రం కుటుంబ అనుబంధాలేనని ఆయన స్పష్టం చేశారు.
'ఈ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా కేవలం ఒకే చోట సాగే కథ మాత్రమే కాదు.. ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు ప్రాంతాలు, ప్రకృతి విపత్తులతో పాటు రామాయణంలోని పురాణ గాథలు, దేవుళ్లు, ఒక ఊహాతీత ఫాంటసీ ప్రపంచం మిళితమై ఉంటాయి. ఈ సినిమా షూటింగ్లో ప్రధాన యాక్షన్‌తో పాటు, ఈ కీలకమైన ఎమోషనల్ సీన్స్ చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తయినట్లు రాజమౌళి తెలిపారు. గతంలో ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం.. కుంభకర్ణుడు-శ్రీరాముడి మధ్య జరిగే యుద్ధ అంశాలు ఇందులో ఉంటాయని హింట్ ఇచ్చారు. అంటే, ఇది పూర్తి పురాణ చిత్రం కాకపోయినప్పటికీ, ఆధునిక కాలానికి పురాణాలను ముడిపెడుతూ సాగే ఒక సరికొత్త విజువల్ జర్నీ అని స్పష్టమవుతోంది. ఇక కథలో తండ్రీకొడుకుల సెంటిమెంట్ ప్రధానం అనగానే, సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రిగా ఎవరు నటిస్తున్నారనే చర్చ ఊపందుకుంది. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్, మహేష్‌కు తండ్రిగా కనిపించే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ గట్టిగా ఊహిస్తున్నారు.
మరోవైపు, మహేష్ బాబు ఈ చిత్రంలో రుద్రుడు, శ్రీరాముడుగా కనిపించబోతున్నట్లు జక్కన్న ముందే ప్రకటించారు. ఇప్పుడు తండ్రీకొడుకుల సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడంతో వారణాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా వారణాసి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. అన్ని హంగులు అద్దుకుని, వచ్చే ఏడాది థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నారో చూడాలి.