
‘ఇంకో జన్మ దాకా ఎందుకు నీ మొహం.. ఈ జన్మలోనే ప్రేక్షకులకు ఇలా కనబడు’ అంటూ దర్శకుడు నాతో రకరకాల డ్రస్సులు వేయించాడని అన్నారు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ.
‘హ్యాపీ జర్నీ’ టీజర్ లాంచ్ వేడుకలో ఆమె ఎమోషనల్‌గా స్పీచ్ ఇచ్చారు.
‘ఇంకో జన్మ దాకా ఎందుకు నీ మొహం.. ఈ జన్మలోనే ప్రేక్షకులకు ఇలా కనబడు’ అంటూ దర్శకుడు నాతో రకరకాల డ్రస్సులు వేయించాడని అన్నారు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (Annapurnamma). గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ (Happy Journey). అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి అన్నపూర్ణమ్మ.. ఈ సినిమాలో వేసిన పాత్ర గురించి చెబుతూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘‘ముందుగా డైరెక్టర్ గురించే చెప్పాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎన్ని పెట్టెలు పట్టుకొచ్చినా.. డైరెక్టర్ ఆర్టిస్టులను వెతుక్కోవడంలోనే వివేకత కనిపిస్తుంది. నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారని అంతా అనుకుంటున్నారు కదా? అంతకుముందు ఎవరెవరినో అనుకున్నారు. ఆ అనుకున్న వాళ్ళు మిస్ అవ్వలేదు.. ఈ అదృష్టం నాకు ఉంది కాబట్టి వాళ్ళు తప్పుకున్నారు అని చెప్తాను నేను. ఈ వేషం నాకు ఎలా పడింది అంటే.. పాతికేళ్ళ ముందు ‘మురారి’ సినిమా చేసేటప్పుడు సుకుమారి అమ్మ వచ్చి నాతో పాటు రూమ్‌లో కూర్చున్నారు. నన్ను చూసి ‘ఏం సినిమాలు చేస్తున్నావ్?’ అని అడిగారు. ‘ఏదో చేస్తున్నానమ్మా’ అని నేను చెప్పాను. ‘అదేంటి మీ తెలుగువాళ్ళు నీకు ఎప్పుడు ఒకటే టైపు వేషాలు ఇస్తారు? ఎప్పుడు ఏడుస్తూ, కన్నీళ్లు తుడుచుకుంటా, త్యాగాలు చేస్తూ ఉండే వేషాలే ఇస్తారేంటి నీకు? అదే మా మలయాళంలో అయితే రకరకాల వేషాలు వేయిస్తారు నీతో. అన్ని రకాల వేషాలు వేయడానికి నువ్వు బాగుంటావు’ అని ఆవిడ అన్నారు. అంటే.. ‘ఏమో అమ్మ, మా తెలుగు వాళ్ళు ఏది పిలిస్తే అదే, వాళ్ళు దేనికి పిలిస్తే దానికే వెళ్లి యాక్ట్ చేస్తాను నేను’ అని చెప్పాను.
ఆమె అలా అన్న మాటని నిజం చేస్తూ.. పాతికేళ్ళకి అభిరామ్ అనే కుర్రాడికి.. ‘ఈ వేషాన్ని ఈవిడ వేస్తే బాగుంటది’ అని వెలిగింది బల్బు. అందుకని నేను ఏమనుకుంటానంటే.. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ మనకి వెన్నంటే శ్రీరామరక్షగా వస్తది. అప్పుడు సుకుమారి అమ్మ అన్నారు, ఆ తర్వాత పాతికేళ్ళు దాటిపోయినట్టు ఉంది ‘మురారి’ వచ్చి.. ఇప్పుడు అభి పిలిచాడు. నేను ‘స్వర్గం నరకం’లో ఒక హీరోయిన్ వేసి, తప్పుకొని తర్వాత మదర్ పాత్రలు వేశాను. ఎంతోకాలం మదర్ గానే ఉన్నా, ఇప్పుడు బామ్మ బామ్మ అంటున్నారు. సరే బామ్మ వేషాల్లో మరి ఈ అబ్బాయికి ఎలా అనిపించిందో! నాకు తెలిసి అందరూ వద్దని అని ఉంటారు. ‘ఆవిడ బాగుండదు, ఆవిడ చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుంటేనే బాగుంటది, వద్దు’ అని చెప్పి ఉంటారు. ఈ అబ్బాయి పట్టుపట్టి ఆ వేషం ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ (AI)లో చేసిన నా బొమ్మ పంపించి.. అక్కడి నుంచి ఏవో డ్రెస్సులు వేయించి నిర్మాతలకి చూపించారు. బాలాజీ, కౌశిక్, తరుణ్, శైలేంద్ర.. వీళ్లంతా యంగర్స్ కదా.. వాళ్లు వద్దని అని ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చూపు వేరే. ఇప్పుడు వచ్చే పిల్లలు ఇప్పుడు వేసుకునే డ్రెస్సులు అవి. బట్ కానీ ఈ పిల్లలందరినీ చూసి నాకు ఎప్పుడు మనసులో అనిపించేది.. ఇంకో జన్మ అంటూ ఉంటే.. ఏమైనా సరే ఈ పిల్లల్లాగా డ్రెస్సులు వేయాలని అనుకునేదాన్ని. కానీ, ‘ఇంకో జన్మ దాకా ఎందుకు నీ మొహం.. ఈ జన్మలోనే ప్రేక్షకులకు ఇలా కనబడు’ అని ప్యాంట్లు, షర్ట్లు, క్రాఫ్ట్‌లు.. అన్ని వేయించేశారు.
ఈ కథ చాలా మంచి కథ. మీ కథ, మా కథ.. మాకు కూడా మనసులో ఉంటాయి కోరికలు.. అవి చెప్పుకోలేకపోయినా, ఏ డైరెక్టర్లో వేషం వేయించి తీరుస్తారు. ప్రేక్షకులకు అలా కాదు కదా, మీరు మీరు చెప్పుకుని.. మీరు బయటికి వస్తే గానీ వెళ్ళలేరు. ఈ సినిమా చూస్తే మీకు (ప్రేక్షకులకు) అన్నీ అర్థమవుతాయి. ఇందులో ఉన్న ఆడవాళ్ళకు, మగవాళ్ళకు.. తలా ఒకళ్ళకి తలా ఒక కోరిక, కథ.. ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది. చాలా సూపర్‌గా కుటుంబమంతా కూర్చుని హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. ‘ఈ సీన్ అబ్బా చూడలేకపోతున్నామే’ అనేవి ఏవీ ఇందులో లేవు. ప్రస్తుతం జరిగే పిల్లల అపరాధాలు, పెద్దవాళ్ళ అపరాధాలు కూడా.. ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం అనేదానికి నిర్వచనంగా ఇందులోని పాత్రలు ఉంటాయి. ఈ యంగర్స్ అందరినీ ప్రేక్షకులు ఆశీర్వదించాలి, సినిమా చూడాలి. ఇన్ని సంవత్సరాలు ఎలాగో చీరతో, పెద్ద బొట్టుతో చూస్తూనే ఉన్నారు.. ఈసారి ఇందులో నేను ఎలా ఉన్నానో చూడడానికి థియేటర్స్‌కు రండి. ఈ కాస్ట్యూమ్స్‌లో, ఈ వేషంలో నేను ఎలా ఉన్నానో మీరు చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఈ సినిమా టీమ్‌లో ఉన్న పిల్లలందరూ చాలా మంచివాళ్ళు. నేను కొన్ని సంవత్సరాల ముందు ఓ బిడ్డను కోల్పోయి మనసంతా బాధతో ఉన్నాను. కానీ పారిస్‌కి వెళ్లి 20 రోజులు వీళ్ళందరితో కలిసి ఉన్నాక.. ఆ పర్వాలేదు, చాలామంది పిల్లలు ఉన్నారు.. నన్ను ‘అమ్మ అమ్మ’ అనటానికి, నాకు ఒక కుటుంబం ఉందని ఒక మనస్తృప్తితో తిరిగి వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నాకు ఒక హ్యాపీ జర్నీ. ప్రేక్షకులందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అని ఎమోషనల్ అయ్యారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. ఇక పట్టుకోలేరేమో
స్వీటీ అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా..?
‘నాగబంధం’ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్స్ వివరాలివే!