శ్రీలంక మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందాడు. ఈ సందర్భంగా ఆలయ అధికారు
లు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలో ఇటీవల TGటీ20 లీగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో భాగంగా ఉన్న ఖమ్మం ఏసెస్ జట్టుకు దిల్షాన్ మెంటార్‌గా, కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ మధ్యలో కాస్త విరామం లభించడంతో దిల్షాన్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమల వెళ్లి సాంప్రదాయ వస్త్రధారణలో తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు.క్రికెటర్లు, సినీ స్టార్లు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, స్వామి వారి ఆశీస్సులు పొందడం అనేది సాధారణమే. మన దేశ పర్యటనకు వచ్చిన ఇతర దేశాల అధినేతలు సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీలంక అధినేతలు ప్రత్యేకంగా తిరుమల వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేవారు. అయితే దిల్షాన్ తిరుమల సందర్శన మాత్రం ప్రత్యేకం అని చెప్పొచ్చు.ఎందుకంటే 2014లో దంబుల్లా వేదికగా శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే సమయంలో.. దిల్షా్న్తో పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ మతం గురించి వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా షెహజాద్ మాట్లాడుతూ.. ‘నువ్వు ముస్లిమేతరుడివి అయినప్పటికీ, ఇస్లాంలోకి మారితే నీ జీవితంలో ఎలాంటి పనులు చేసినా సరే నేరుగా స్వర్గానికి వెళ్తావు’ అని వ్యాఖ్యానించాడు. అయితే దిల్షాన్ ఏమన్నాడనేది సరిగా వినిపించలేదు. ఆ తర్వాత షెహజాద్ మాట్లాడూ.. అయితే నరకాగ్నిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అని బదులిచ్చాడు. దిల్షాన్ హావభావాలు, షెహజాద్ స్పందనను బట్టి చూస్తే.. పాక్ ఆటగాడి వ్యాఖ్యలతో శ్రీలంక క్రికెటర్ ఏకీభవించలేదని అర్థమైంది. షెహజాద్ మతం గురించి మాట్లాడటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతడికి సమన్లు కూడా జారీ చేసింది. అయితే శ్రీలంక వైపు నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో అతణ్ని వదిలేసింది.ఆసక్తికర విషయం ఏంటంటే.. దిల్షాన్ తండ్రి ఒక మలేసియా మూలాలు ఉన్న ముస్లిం కాగా తల్లి శ్రీలంక బౌద్ధురాలు. దిల్షాన్ అసలు పేరు తువాన్ మహ్మద్ దిల్షాన్. తల్లిదండ్రులు విడిపోయాక తన 16వ ఏట దిల్షాన్ బౌద్ధ మతంలోకి మారాడు. దిల్షాన్‌కు ముస్లిం పేరు ఉన్నప్పటికీ, అతడితోపాటు అతడి తోబుట్టువులు కూడా చిన్నతనం నుంచి తన తల్లి మతమైన బౌద్ధాన్ని అనుసరించే వారని దిల్షా్న్ చిన్ననాటి కోచ్ రంజన్ పరణవితన చెప్పారు.దిల్షాన్ తిరుమల వెంకటేశ్వరుణ్ని సందర్శించుకోవడంతో.. నెటిజన్లు 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ అతడితో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. దిల్షాన్‌ను ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించిన అహ్మద్ షెహజాద్‌కు ఇది చెంప పెట్టు లాంటిందని కామెంట్ చేస్తున్నారు.