
రాజధాని అమరావతి ప్రాంతంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉండవల్లి పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.
ఈ రగడపై సీరియస్‌గా స్పందించిన తాడేపల్లి పోలీసులు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా మూడు వేర్వేరు క్రిమినల్ కేసులను నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ గొడవలకు సంబంధించి పెనుమాక ప్రాంతానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు పలువురు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కేవలం స్థానికుల ఫిర్యాదులే కాకుండా, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగినందుకు కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీ బృందం పర్యటించే సమయంలో భద్రతా విధులను పర్యవేక్షిస్తున్న సీఐ వీరేంద్రబాబును నెట్టివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సదరు పోలీస్ అధికారి స్వయంగా ఫిర్యాదు చేయడంతో, అంబటి రాంబాబుపై పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం అదనంగా మరో కేసు నమోదైంది.
మరోవైపు వైఎస్సార్సీపీ శ్రేణులపైనే కాకుండా ప్రతిపక్ష నేతలు, రైతులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పర్యటనలో ఉన్న వైసీపీ నాయకుడు నారాయణమూర్తి వాహనంపై కొందరు దుండగులు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీనిపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కొందరు అమరావతి రైతులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఘర్షణల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పర్యటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, కానిస్టేబుల్‌పై దాడికి తెగబడిన గుంపుపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. కొందరు వ్యూహాత్మకంగా రాళ్లదాడికి పాల్పడి, అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే కోణంలో విచారణ సాగుతోంది.
ఈ ఘర్షణల వెనుక ముందస్తు ప్రణాళిక ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న చైతన్య అనే వ్యక్తి, నిన్నటి ఉండవల్లి గొడవల్లో కూడా వైసీపీ నేతల పక్కనే తిరిగినట్లు పోలీసులు సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. దీంతో ఈ వివాదానికి పాత కక్షలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలు, వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని, త్వరలోనే అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో మరింత రాజేసేలా కనిపిస్తున్నాయి.
గృహప్రవేశంలో రక్తపాతం...50 మంది దుండగులు బీభత్సం
హైదరాబాద్‌లో కొత్త ఇంటి కల...ప్రాణాల మీదకు తెచ్చిన ప్రమాదం!
.