
ఇడుపు కాయితం(Idupu kaayitham) టైటిల్పై సోషల్ మీడియాలో కొనసాగుతున్న డిస్కషన్స్ కు నిర్మాత బన్నీ వాసు(bunny vasu) స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
సినిమా పేరు మార్చే ఆలోచన చిత్రబృందానికి లేదని ఆయన తేల్చిచెప్పారు. కథలోని మెయిన్ ఎమోషన్ ను ప్రతిబింబించే పదమే ఇడుపు కాయితం కావడంతో అదే టైటిల్ను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ టైటిల్ ను కేవలం ఎట్రాక్షన్ కోసం పెట్టలేదని, సినిమా కథ మొత్తం దాని చుట్టూనే తిరుగుతుందని ఆయన వివరించారు. సినిమా రిలీజైన తర్వాత టైటిల్ వెనుక ఉన్న ఉద్దేశం ప్రేక్షకులకు పూర్తిగా అర్థమవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి(vamsi reddy dondapati) తెలంగాణ గ్రామీణ జీవన విధానం, అక్కడి భాషా సంస్కృతిని ఆధారంగా చేసుకుని ఈ కథను రూపొందించారని బన్నీ వాసు తెలిపారు. స్థానిక యాసలో సహజంగా వినిపించే పదాన్ని కథకు అనుగుణంగా ఎంపిక చేశామని చెప్పారు. ఇది ఒక ప్రాంతానికే పరిమితమైన కథ కాదని, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, భావోద్వేగాలను ప్రతిబింబించే యూనివర్సల్ సబ్జెక్ట్ అని పేర్కొన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా చేరువ అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
భాషలు, యాసల ఆధారంగా సినిమాలను విమర్శించడం లేదా ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టే కామెంట్స్ చేయడం సమాజానికి మంచిది కాదని బన్నీ వాసు సూచించారు. బలమైన కథ, హృదయాన్ని తాకే ఎమోషన్ ఉంటే ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. బన్నీ వాసు వర్క్స్(Bunny vasu works), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో కొనసాగుతోంది. టైటిల్పై ఎలాంటి వివాదం ఉన్నప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కథే అన్ని సందేహాలకు సమాధానం ఇస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.