
హైదరాబాద్ ఎల్బీ నగర్లోని 'శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్'లో అర్ధరాత్రి జరిగిన ఒక అనూహ్య ఘటన తీవ్ర కలకలం రేపింది. చికిత్స కోసం వచ్చిన మహిళ, అనూహ్యంగా సిబ్బంది
పై దాడికి పాల్పడటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఆసుపత్రి యాజమాన్యం అందించిన వివరాల ప్రకారం.. లలిత కరీర అనే మహిళ అర్ధరాత్రి సమయంలో తీవ్రమైన కడుపునొప్పి అని చెబుతూ ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చింది. వెంటనే స్పందించిన వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించారు. అయితే, పరీక్షల్లో ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా ఆ మహిళ ప్రవర్తనలో మార్పు వచ్చింది.
వైద్యుల సమాధానంతో అసంతృప్తి చెందిన సదరు మహిళ, ముందస్తు ప్రణాళికలో భాగంగానే వ్యవహరిస్తున్నట్లుగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడింది. విధుల నిర్వహణకు ఆటంకం కలిగించడమే కాకుండా, సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడింది. ఈ హఠాత్పరిణామంతో అత్యవసర విభాగంలోని రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే ఆసుపత్రి యాజమాన్యం 'డయల్-100'కు సమాచారం అందించగా, ఎల్బీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, పోలీసుల సమక్షంలో కూడా సదరు మహిళ అదే స్థాయిలో రెచ్చిపోతూ సిబ్బందిపై దాడిని కొనసాగించడం గమనార్హం. అనంతరం ఆమె తన కారు (TS 08 HG 9824)ను స్వయంగా నడుపుకుంటూ అక్కడి నుంచి వనస్థలిపురంలోని సహారా హాస్పిటల్కు చేరుకుంది.
రొనాల్డో.. మా సంజు శాంసన్ ను ఆదర్శంగా తీసుకున్నావేటి..!!#SanjuSamson #CristianoRonaldo #Portugal #Colombia #FIFA_WorldCup_2026 #FIFA2026 #FIFAWoeldCup #OneindiateluguMore Details:
గతంలో కూడా తమ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని కొందరు తప్పుడు ఆరోపణలు చేశారని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఘటన కూడా పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రలో భాగమేనా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరపాలని వారు పోలీసులను కోరారు. ప్రజా సేవలో ఉన్న వైద్యులు, నర్సులపై దాడులు చేయడం అత్యంత తీవ్రమైన అంశమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.