
సుమారు 34 ఏళ్ల క్రితం... ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం 1,500 జేబులో పెట్టుకుని, కళ్ల నిండా కలలతో వచ్చాడు షారుఖ్ ఖాన్. కానీ ఇవాళ, ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనిక నటుల్లో ఒకరు.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, షారుఖ్ ఆస్తి విలువ సుమారు 1.4 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు 12,490 కోట్లు! ఈ డబ్బు కేవలం సినిమాలతోనే రాలేదు. ప్రొడక్షన్ హౌస్, ఐపీఎల్ టీమ్, రియల్ ఎస్టేట్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఇతర పెట్టుబడులు... ఇలా అన్నీ కలిపి బాలీవుడ్ 'కింగ్ ఖాన్' ఈ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అసలు ఆయన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం.
యాక్టింగ్ మీద పిచ్చితో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన షారుఖ్, మొదట్లో కొన్ని కష్టాలు పడ్డా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జూన్ 25, 1992న ఆయన మొదటి సినిమా 'దీవానా' రిలీజ్ అయింది. అప్పటి నుంచి మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో, ఆయన కేవలం సూపర్‌స్టార్‌గానే కాదు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా కూడా ఎదిగారు.
ముంబై బాంద్రాలో సముద్రం పక్కన ఉండే షారుఖ్ ఖాన్ బంగ్లా 'మన్నత్' గురించి తెలియని వాళ్లుండరు. దాని ప్రస్తుత విలువ సుమారు 300 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఆ బంగ్లాలో రెనోవేషన్ పనులు జరుగుతుండటంతో, షారుఖ్ తన కుటుంబంతో కలిసి పాలీ హిల్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. దాని నెలవారీ అద్దె సుమారు 24 లక్షలట. ఇది కాకుండా, అలీబాగ్‌లో ఆయనకు ఓ పెద్ద ఫామ్‌హౌస్ కూడా ఉంది. దాని విలువ దాదాపు 15 కోట్లు. ఈ ఫామ్‌హౌస్‌లో హెలిప్యాడ్, స్విమ్మింగ్ పూల్ లాంటి లగ్జరీ సౌకర్యాలు కూడా ఉన్నాయి.
సినిమాలే కాకుండా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో పెట్టుబడి పెట్టి బిజినెస్ ప్రపంచంలోనూ షారుఖ్ తన మార్క్ చూపించారు. ఐపీఎల్ మొదలైనప్పుడు, ఆయన ఈ టీమ్‌లో 55 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఇక 2002లో 'రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్' అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ఈ సంస్థ సినిమా నిర్మాణం, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), డిస్ట్రిబ్యూషన్ వంటి పనులు చూసుకుంటుంది. 'ఓం శాంతి ఓం', 'మై నేమ్ ఈజ్ ఖాన్', 'రా.వన్', 'డాన్ 2', 'డియర్ జిందగీ', 'బద్లా' లాంటి ఎన్నో సినిమాలు ఈ బ్యానర్లోనే నిర్మించారు. రిపోర్టుల ప్రకారం, ఈ కంపెనీకి కిడ్జానియా ఇండియా (KidZania India)లో కూ
షారుఖ్ ఖాన్ గ్యారేజీలో లగ్జరీ కార్లకు కొదవే లేదు. ఆయన దగ్గర సుమారు 12 కోట్ల విలువైన బుగాటి వేరాన్, దాదాపు 9.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, సుమారు 3.39 కోట్ల బెంట్లీ కాంటినెంటల్ జీటీ, 2.62 కోట్ల బీఎండబ్ల్యూ ఐ8, 1.35 కోట్ల బీఎండబ్ల్యూ 7 సిరీస్, 1.77 కోట్ల నుంచి 1.86 కోట్ల మధ్య ఉండే మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, సుమారు 88 లక్షల మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతేకాదు, ఆయన ఎన్నో ప్రీమియం కార్లు, వాచీలు, సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆయన వార్షిక సంపాదనలో బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుంచే పెద్ద మొత్తం వస్తుంది. టెక్నాలజీ, ఎడ్టెక్ రంగాల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారని సమాచారం.
రిపోర్టుల ప్రకారం, షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు ఫీజు తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన 'పఠాన్', 'జవాన్' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆయన కింగ్డమ్ను మరింత పటిష్టం చేశాయి. 'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,005 కోట్లు వసూలు చేయగా, 'జవాన్' దాదాపు 1,160 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఆయన నెక్స్ట్ సినిమా 'కింగ్'. ఇది ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ కానుంది.