
పాల ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు, ఈ- వేస్ట్...ఇలా చెప్పుకొంటూపోతే పొడిచెత్త లిస్ట్ చాలానే ఉంటుంది. వాటిని చెత్తబుట్టలో వేసి చేతులు దులుపుకొంటాం!
అయితే ఇలాంటి పొడిచెత్తకు విలువ కట్టి, అంత మొత్తంలో సరుకులు తీసుకెళ్లమంటోంది ‘గూడీబ్యాగ్’. ఈ ఆలోచనకు రూపకర్త అభిషేక్ అగర్వాల్. ఒక్కడిగా మొదలైన అతని ప్రయాణం నలుగురికి ఉపాధి కల్పిస్తూ... చెత్తలేని నగరానికి బాటలు వేస్తోంది. ఆ విశేషాలే ఇవి... న్యూఇయర్ వేడుకల్లో లక్ష బిర్యానీలు అమ్ముడుపోయాయని ఒక ఆన్లైన్ సంస్థ గొప్పగా ప్రకటిస్తుంది. అయితే ఆ బిర్యానీలతో పాటు ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు వెళ్లుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బట్టలు, ఇతర సరుకులను ఆర్డర్ పెడుతుంటారు. వాటిని డెలివరీ చేయడానికి ఎన్ని డబ్బాలు, ఎంత ప్లాస్టిక్ వినియోగం జరుగుతుందో ఊహించారా? ఈ డబ్బాలు, కవర్లను చెత్త బుట్టలో పడేసి చేతులు దులుపుకుంటుంటాం. ఇలాంటి చెత్తలో కేవలం 23-28శాతం వరకే రీసైకిల్ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పైగా డంపింగ్ యార్డ్ల ద్వారా అధిక మీథేన్ ఉత్పత్తి అవుతున్నదట. ఇలా మీథేన్ అధికంగా ఉత్పత్తి చేస్తున్న డంపింగ్ యార్డుల్లో... హైదరాబాద్ శివారుల్లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉందని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చెత్తవల్ల జనాలకే కాదు... పశుపక్ష్యాదులకు కూడా ఎంతో హాని జరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయటమే ‘గూడీబ్యాగ్’ లక్ష్యం. అభిషేక్ అగర్వాల్ పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లో. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు సొంత బిజినెస్ చూసుకోమన్నారు. అయితే తానే స్వయంగా ఒక బిజినెస్ మొదలెట్టాలనుకున్నాడు. ఒక లాజిస్టిక్ కంపెనీని 13 ఏళ్లుగా దేశవ్యాప్తంగా నడిపాడు. కానీ తాను చేరాలనుకున్న గమ్యస్థానం అది కాదని అతడికి స్పష్టంగా తెలుసు. కరోనా తర్వాత అంటే.. 2022లో అభిషేక్ ఆలోచనలకు ఒక దారి దొరికింది. ఇంట్లో పేరుకుపోతున్న చెత్తనే అతని ఆలోచనలకు పదును పెట్టింది. అలా మొదలైంది ... మార్కెట్ లెక్కల ప్రకారం ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతీరోజూ 30 లక్షల లీటర్ల పాల వినియోగం జరుగుతోంది. ఈ లెక్కన దేశంలో పాల వినియోగం ఎంత? ఆ పాలను తీసుకొచ్చే పాల ప్యాకెట్ల వ్యర్థం రీసైకిల్ అవుతోందా? అభిషేక్‌కి కూడా ఒకరోజు ఈ లెక్కలు మతిపోగొట్టాయి. వీటిని ఎవరైనా తీసుకుంటారా? అని హైదరాబాద్ అంతా జల్లెడ పట్టాడు. ఫలితం లేదని తెలుసుకున్నాడు. దీంతో తానే ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. తన ఆలోచనను తొలుత కమ్యూనిటీ గ్రూప్‌లో పంచుకున్నాడు. కానీ స్పందన లేదు. దాంతో చెత్త ఇస్తే వారికి ఏదైనా ఇవ్వాలని భావించాడు. చెత్త ఇస్తే సరుకులిస్తానని చెప్పగానే స్పందన ఒక్కసారిగా పెరిగింది. అంతే... ‘గూడీబ్యాగ్’ మొదలెట్టాడు. పర్యావరణ పరిరక్షణ... అభిషేక్ పర్యావరణ పరిరక్షణ ఆలోచన, తపన ఇంట్లో వాళ్లలో కొంత మార్పు తీసుకొచ్చింది. ఆ తర్వాత గూడీబ్యాగ్ సేవలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేయాలనుకుని ‘గూడీబ్యాగ్’ యాప్ రూపకల్పన చేశాడు. ఒక్కడిగా మొదలైన ఈ సర్వీస్ ప్రస్తుతం 15మందికి ఉపాధి కల్పిస్తోంది. చెత్తను సేకరించి రీసైకిల్‌కి పంపేలా ఒక వేర్‌హౌస్‌ని ఏర్పాటు చేశాడు. ఇప్పటిదాకా 30వేల మందికి పైగా ఈ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. 93 వేల కిలోలకు పైగా చెత్తను రీసైకిల్ చేశారు. దీనివల్ల 7 వేలకు పైగా చెట్లను పరిరక్షించినట్లు చెబుతున్నారు. ‘‘మన ముందు తరాలకు మనం ఏం ఇస్తున్నాం? ఢిల్లీలో ఆక్సిజన్ కొనే స్థితి ఎందుకు వచ్చింది? హైదరాబాద్‌లో కూడా ఆ పరిస్థితి రాకూడదని నేను భావిస్తున్నా. ఈ సర్వీస్ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో ఉంది. త్వరలోనే దేశమంతా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నా. ప్రతీ జిల్లాల్లో డాక్ స్టోర్ ఏర్పాటు చేసే పనిలో ఉన్నాం. మేం సేకరించే చెత్త కోసం ఈవీ వెహికల్స్ మాత్రమే వాడుతున్నాం’’ అంటున్న అభిషేక్ అగర్వాల్ ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. చెత్త సేకరణ ఇలా... స్టెప్ 1: ‘గూడీబ్యాగ్’ వాళ్లు చెత్త వేయడానికి ఒక సంచీని ఇస్తారు. దాంట్లో కేవలం పొడి చెత్తను వేయాల్సి ఉంటుంది. స్టెప్ 2: బ్యాగ్ నిండిన తర్వాత ‘గూడీబ్యాగ్’ యాప్‌లోకి వెళ్లి... నచ్చిన సమయం ఎంచుకొని బ్యాగ్ పికప్ షెడ్యూల్ చేసుకోవాలి. స్టెప్ 3: చెత్తను అక్కడే తూకం వేస్తారు. యాప్‌లో బరువుకు తగినవిధంగా పాయింట్లు వస్తాయి. కిలోకి 4 పాయింట్ల చొప్పున అకౌంట్లో యాడవుతాయి. స్టెప్ 4: పాయింట్లను అవసరమున్నప్పుడు రీడీమ్ చేసుకోవచ్చు. అంటే.. ఆ పాయింట్ల ద్వారా కావాల్సిన సరుకులను వీరి దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. ఉచితంగానే సరకులను డెలివరీ చేస్తారు. ఈ వార్తలు కూడా చదవండి: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే.. బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా? Read Latest AP News And Telangana News And International News And Telugu News