
Anant Ambani visits Tirumala : ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆదివారం వేకువజామున తిరుమలకు చేరుకున్న అనంత్ అంబానీ.. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం టీటీడీ ఈవో, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసి సత్కరించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం.. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అంతేకాకుండా..అనంత్ అంబానీ స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
తిరుమల శ్రీవారి దర్శనం తరువాత అనంత్ అంబానీ టీటీడీకి భారీ విరాళాన్ని ప్రకటించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, భక్తుల రవాణా సౌకర్యాలలో భాగంగా సుమారు రూ.27.5కోట్ల విలువచేసే 25 ఎలక్ట్రిక్ బస్సులు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. 50మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు కూడా చెల్లించడంతో పాటు, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకోసం తిరుమలలో అత్యాధునిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గుజరాత్ వంతారాలో ఉన్నట్టుగా టీటీడీ గోశాలను ఆధునికీకరణకు అంగీకారం తెలిపారు. గోవుల సంరక్షణ, వైద్య సదుపాయాలు, ఆధునిక మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. అనంత్ అంబానీ ప్రకటించిన ఈ విరాళాలు, సేవా కార్యక్రమాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.