
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(salman khan) హీరోగా, వంశీ పైడిపల్లి(Vamshi paidipally) తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, ఆ డెసిషన్ వెనుక ఆసక్తికరమైన వ్యక్తిగత సెంటిమెంట్ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రిలీజ్ డేట్ సెలెక్షన్ పూర్తిగా వ్యాపార వ్యూహం ఆధారంగా మాత్రమే కాకుండా, తమకు ప్రత్యేకంగా నమ్మకం కలిగించిన సంఖ్యతో కూడా సంబంధం ఉందని చెప్పడం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు వెల్లడించారు. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, తాను, సహ నిర్మాత శిరీష్‌ల బర్త్ డే డేట్స్ ను కలిపి లెక్కిస్తే 9 వస్తుందని తెలిపారు. అదే సమయంలో తమ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా 63వ ప్రాజెక్ట్ కావడం, 6+3 కూడా 9 కావడం మరో విశేషమని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలు కలిసి రావడంతో 2027లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు. సినీ పరిశ్రమలో వ్యక్తిగత సెంటిమెంట్లను నమ్మే వారు చాలామందే ఉన్నప్పటికీ, వాటిని ఇంత స్పష్టంగా వెల్లడించడం అరుదుగా కనిపించే విషయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని, అక్టోబర్ నాటికి షూటింగ్ ను పూర్తి చేయాలనే టార్గెట్ తో యూనిట్ పనిచేస్తోందని సమాచారం. ఇప్పటికే పూర్తైన సీన్స్ చూసినప్పుడు సినిమా స్థాయి స్పష్టంగా కనిపిస్తోందని, సల్మాన్ ఖాన్ అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ స్థాయి ఎలివేషన్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని దిల్ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈద్ సీజన్లో సల్మాన్‌కు ఉన్న బాక్సాఫీస్ ఇమేజ్, వంశీ కమర్షియల్ శైలి, దిల్ రాజు నిర్మాణ విలువలు కలిసి ఈ సినిమాను 2027లో అత్యంత ఆసక్తికరమైన విడుదలల్లో ఒకటిగా నిలబెడతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.