
తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సినిమా దొంగరాముడు.
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, సావిత్రి హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో జమున ఏఎన్నార్ చెల్లెలుగా నటించింది. 1955లో రిలీజ్ అయిన ఈ సినిమాకు కె.వి. రెడ్డి దర్శకుడు. కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యత, మానవత్వం, వంటి జనాలకు ఉపయోగపడే అంశాలను కలగలిపి అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా దొంగరాముడు. ఈ చిత్రం నేటికీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాము (అక్కినేని నాగేశ్వరరావు) తన చెల్లెలు లక్ష్మి(జమున)ని ఎంతో ప్రేమగా పెంచాలని భావిస్తాడు. అయితే పేదరికం, ఆకలి, అనాథ జీవితం అతడిని చిన్నచిన్న దొంగతనాల వైపు నెడతాయి. తల్లి అనారోగ్యం వల్ల మందులు దొంగతనం చేస్తూ.. దొరికిపోయి కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బాల నేరస్తుల జైల్లో అతన్ని వేస్తారు. రాము జైలులో ఉండగా తల్లి మరణించడంతో.. చెల్లెలు లక్ష్మి అనాథాశ్రమంలో చేరుతుంది.
శిక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన రాము కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. నిజాయితీగా జీవించాలనుకున్నా, గతం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. సమాజం అతడిని అనుమానంతో చూస్తుంది. మరోవైపు తన చెల్లెలు కోసం చేసే ప్రయత్నాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు.
ఈ క్రమంలో సీత (సావిత్రి) రాము జీవితంలోకి వస్తుంది. ఆమె ప్రేమ, నమ్మకం రాముకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయి. చెల్లెల్ని కలుసుకోవాలన్న రాము ప్రయత్నాల వల్ల లక్ష్మీ ఇబ్బందులు పడుతుంటుంది. ఆ సమయంలోనే ఆమెకు డాక్టరు మోహన్ అండగా ఉంటాడు. ఈ క్రమంలో రాముపై హత్యానేరం మోపబడుతుంది. ఈవిషయంలో సీత రాముకి అండగా ఉంటుంది. చివరికి రాము తన చెల్లెల్ని కలుసుకుంటాడా? తనపై ఉన్న నేరస్థుడి ముద్రను చెరిపేసుకుని సమాజంలో గౌరవంగా నిలబడతాడా? అనేదే మిగిలిన కథ.
'దొంగరాముడు' సినిమా సాధారణ దొంగ కథ కాదు. పరిస్థితుల కారణంగా నేరం చేసిన వ్యక్తి జీవితంలో మార్పు రావాలంటే సమాజం కూడా అవకాశం ఇవ్వాలనే సందేశాన్ని దర్శకుడు కె.వి. రెడ్డి ఎంతో అద్భుతంగా చెప్పాడు. కథలో ఎమోషన్స్ కు పెద్దపీట వేస్తూనే.. మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా అందించాడు. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, సామాజిక విలువలను కలగలిపి.. మంచి విలువలు ఉన్న సినిమాను సమాజానికి అందించాడు కేవి రెడ్డి.
సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే కథనం ప్రధాన బలం. మొదటి భాగంలో రాము బాల్యం, అతని పరిస్థితులు ఆడియన్స్ ను ఏడిపిస్తాయి. రెండో భాగంలో కుటుంబ అనుబంధాలు, ప్రేమ, త్యాగం, ఆత్మగౌరవం వంటి అంశాలు కథను మరింత బలంగా నిలబెడతాయి. . క్లైమాక్స్ మాత్రం ప్రతీ సగటు ప్రేక్షకుడికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది.
అక్కినేని నాగేశ్వరరావు రాము పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. అమాయకత్వం, ఆవేశం, చెల్లెలిపై ప్రేమ, భావాలను సహజంగా ఆవిష్కరించారు. ఈ పాత్ర ఆయన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలిచింది. ఇక మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జమున కూడా అక్కినేని చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక జగ్గయ్య, రేలంగి, సూర్యకాంతం తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కటి నటన ప్రదర్శించారు. ముఖ్యంగా రేలంగి హాస్యం ఎమోషనల్ సీన్స్ మధ్యలో.. ఆడియన్స్ ను కాస్త నవ్విస్తూ.. ఉపశమనం కలిగిస్తుంది.
దొంగరాముడు సినిమాకు కె.వి. రెడ్డి దర్శకత్వం ప్రధాన బలం. ప్రతి సన్నివేశాన్ని సహజత్వంతో, బలమైన కథనంతో తెరకెక్కించారు. సామాజిక సందేశాన్ని టీచర్ మాదిరి రుద్దకుండా.. ఆడియన్స్ కు బోర్ అనిపించకుండా కథలోనే కలిపి వడ్డించాడు రెడ్డి. పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. పాటలు, నేపథ్య సంగీతం కథకు బలం చేకూర్చాయి. ఛాయాగ్రహణం, ఎడిటింగ్ కూడా ఆ కాలానికి తగినట్టుగా అద్భుతంగా అందించారు.
అమెరికన్ కథ "Loving Brothers" ఆధారంగా దొంగరాముడు సినిమాను తెరకెక్కించారు. అందులో అన్న పాత్రను చెల్లలు పాత్రగా మలిచారు. ఇక అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఫస్ట్ సినిమా దొంగరాముడు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు భాగస్వామ్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. తొలి చిత్రమే ఘనవిజయం సాధించి, అన్నపూర్ణ పిక్చర్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థగా నిలబెట్టింది. అంతే కాదు దర్శకుడు కె.వి. రెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే.
ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, జమున అన్నాచెల్లెలుగా నటించారు. ఆతరువాత రోజుల్లో ఇద్దరు జంటగా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. చెల్లెలుగా నటించిన జమునతోనే గుండమ్మ కథ లాంటిసినిమాల్లో ఘాటు రొమాన్స్ చేశారు అక్కినేని. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం హీరో అక్కినేని నాగేశ్వరరావు.. విలన్ గా నటించిన ఆర్. నాగేశ్వరరావు ప్రత్యేకంగా స్టంట్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ కాలంలో ఇలా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడం చాలాప్రత్యేకం.
దొంగరాముడు సినిమా హిట్ అవ్వడంతో పలు భాషల్లో ఈమూవీని డబ్ చేశారు. తమిళంలో "తిరుట్టు రామన్" పేరుతో డబ్ చేశారు. తర్వాత హిందీలో మన్ మౌజీ, తమిళంలో వసంతి పేర్లతో రీమేక్ చేశారు.ఈ చిత్రం అత్యుత్తమ చిత్ర నిర్మాణానికి ఉదాహరణగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో (ఆర్కైవ్‌లో) చోటు సంపాదించింది. ఇది తెలుగు సినిమాకు లభించిన అరుదైన గౌరవాల్లో ఒకటి. ఈ సినిమా చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.