
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేశారు.
రన్‌వే, టెర్మినల్ భవనం, ఏటీసీ పనులన్నీ వంద శాతం పూర్తి
వచ్చే నెలలో విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు
ప్రధాని చేతులమీదుగా జాతికి అందించేందుకు ఏర్పాట్లు
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి చోదక శక్తిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో గడువులోగా పనులన్నీ చకచకా పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయంలో ప్రధాని కార్యాలయం ఇచ్చే తుది షెడ్యూల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఎయిర్‌పోర్టు టెర్మినల్ బిల్డింగ్, రన్‌వే, ఏటీసీ టవర్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం జూలైలో మంచి రోజులు ఉన్నాయంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు పంపింది. భోగాపురం విమానాశ్రయంతో పాటు మరిన్ని ప్రాజెక్టులు కూడా ప్రధాని చేతులు మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో విమానాశ్రయ ప్రారంభోత్సవ షెడ్యూల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖలో ఉన్న విమానాశ్రయం నేవీ రక్షణ పరిధిలో ఉండడంతో అంతర్జాతీయ సర్వీసులకు, రాత్రి వేళల్లో విమాన రాకపోకలకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, విభజన హామీల్లో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎంఆర్ సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. అత్యాధునిక రన్‌వే, అంతర్జాతీయ కార్గో టెర్మినల్, ఏకకాలంలో పదుల సంఖ్యలో విమానాలు పార్కింగ్ చేసే ఏప్రాన్ సౌకర్యాలతో ఈ ఎయిర్ పోర్టు రూపుదిద్దుకుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్లోబల్ కనెక్టివిటీ వస్తుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న ఫార్మా హబ్‌లు, ఐటీ కారిడార్లు, ఆక్వా రంగాల్లో ఈ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కార్గో సేవలతో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇక్కడి ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. దీనివల్ల వందలాది గ్లోబల్ కంపెనీలు ఉత్తరాంధ్ర వైపు చూసే అవకాశం ఉంది. తద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా 16వ నంబరు జాతీయ రహదారి, విశాఖ-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి అందుబాటులోకి రావడంతో కనెక్టివిటీ మరింత పెరగనుంది.
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణ సమయం తగ్గించేందుకు ప్రభుత్వం ఆరులేన్ల బీచ్ కారిడార్ రహదారి పనులను కూడా వేగవంతం చేసింది. విజయనగరం నుంచి ఇప్పటికే ఉన్న గ్రామీణ రహదారులను విస్తరించి భోగాపురం ప్రధాన రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఈ కనెక్టివిటీతో భోగాపురం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు మరింత ఊపు రానుంది. అలాగే డెంకాడ, పూసపాటిరేగ, విజయనగరం, గజపతినగరం వరకూ రియల్ఎస్టేట్ రంగం జోరందుకుంది. విశాఖ, విజయనగరం మధ్య హోటల్ రంగం మరింతగా విస్తరించనుంది.
‘దేశంలో అన్ని విమానాశ్రయాల్లో యూజర్ డెవల్‌పమెంట్ ఫీజు (యూడీఎ్ఫ)లు ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. అందుకే ఇక్కడ విశాఖ కంటే అదనం. అదికూడా ప్రతిపాదన మాత్రమే ఇంకా ఖరారు చేయలేదు. ఈ విషయాన్ని అధికారులు కూడా ఎక్కడా నిర్ధారించలేదు’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. శనివారం విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారని, ఎప్పుడన్న దానిపై త్వరలో పీఎంవో నుంచి స్పష్టత వస్తుందని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీకి జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు త్వరలో పూర్తవుతాయని అన్నారు. ప్రస్తుతానికి విమానాశ్రయం చేరుకునేందుకు జాతీయ రహదారి 16 ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలోనే భోగాపురం విమానాశ్రయానికి అంకురార్పణ జరిగిందని, ప్రారంభోత్సవం కూడా టీడీపీ హయాంలోనే జరుగుతుందన్నారు. ఎర్రబస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్‌పోర్టు ఎందుకంటూ వైసీపీ వారు ఎగతాళి చేశారని, ఇప్పుడు ఎయిర్‌పోర్టును కట్టామని వాళ్లు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి