
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Amaravati: 'అమరావతి చట్టం కూడా అయిపోయాక మావిగన్ అంటున్నారు. మావిగన్ అంటే ఎవరికీ అర్థం కాదు. అందరూ ఛీ కొడుతున్నారు. బాధ్యత లేని రాజకీయ పార్టీ ప్రజలను, వారి నిర్ణయాన్ని అపహాస్యం చేస్తోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే వెంటనే స్పందించి ఆ గేటు బిగించి కొత్తగా 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశామని.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. గంగా- కావేరి నదులతో పాటు గోదావరి- నల్లమల సాగర్ లింక్‌తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కాలర్ ఎగరేసి చెప్పేలా ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్ష చేసిన అనంతరం గిద్దలూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. 'అమరావతిని హరిత నగరంగా, నివాస యోగ్య ప్రాంతంగా నిర్మిస్తున్నాం. మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తాం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గొడ్డలి పార్టీ ముందు అమరావతిని అంగీకరించి ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు తాత్సారం చేసిన గొడ్డలి పార్టీ అభివృద్ధిని ఆమడదూరం పెట్టిందని గుర్తుచేశారు. గొడ్డలి పార్టీ నాయకులు మోసాలు చేయటంలో దిట్టలు అని విమర్శించారు.
రాష్ట్రాలకు అదే శ్రీరామ రక్ష 'గోదావరి నుంచి కావేరి నది వరకూ నీటిని తీసుకెళ్తాం. నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎవరికీ కడుపు ఉబ్బరం అవసరం లేదు' అని ప్రతిపక్షాలకు చంద్రబాబు స్పష్టం చేశారు. 'రైతు ప్రయోజనాలే ముఖ్యం కావాలి. ఎల్‌నినోతో వర్షాలు లేక నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గాయి. పర్యావరణం, నీటిని పొదుపుగా వాడుకోవాలి. వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చటమే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం' అని అప్రమత్తత ప్రకటించారు. చెక్‌డ్యామ్‌లు కడితే ఎగతాళి చేశారని.. కానీ సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడపాలన్నదే తన లక్ష్యం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
రెచ్చగొట్టే ప్రయత్నాలు 'జలధార ద్వారా భూగర్భజలాలు పెంచి అన్నమయ్య జిల్లా విజయం సాధించింది. ఇంత చేస్తుంటే కులం, మతం, ప్రాంతం అని కొందరు కుట్రలు చేస్తున్నారు. సమర్ధవంతమైన ప్రభుత్వమే ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయగలుగుతుంది. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు' అని వైఎస్సార్సీపీ నాయకులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇటీవల విజయవాడలో జరిగిన ఓ ఘటనకు కులం రంగు పులిమి పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. హోం మంత్రి అనిత మేకప్ గురించి కొందరు మాట్లాడుతున్నారు. వారికి సిగ్గు అనిపించటం లేదు' అని మండిపడ్డారు.
చూస్తూ ఊరుకోం పోలీసులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని.. తాము చూస్తూ ఊరుకోం అని చంద్రబాబు హెచ్చరించారు. 'కుట్ర చేయడానికే అమరావతికి వెళ్లారు. బాధలో కోపంలో ఉన్న రాజధాని రైతులను రెచ్చగొట్టడానికే అమరావతికి వెళ్లారు. రాజధాని నిర్మాణం జరుగుతుంటే దానిని అడ్డుకోడానికే వైఎస్సార్సీపీ నాయకులు రాజధాని ప్రాంతానికి వెళితే రైతులు అడ్డుకున్నారు' అని సీఎం చంద్రబాబు వివరించారు. గొడ్డలి పార్టీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉందని.. గొడ్డలి పార్టీ రాజకీయాలు చేసేందుకు అర్హత లేదని స్పష్టం చేశారు.
మనది పాజిటివ్ పాలిటిక్స్ 'మత సామరస్యంతో వ్యవహరించాలి. దేవాలయాలపై దాడులు చేసిన వ్యక్తులు ఇప్పుడు దేవాలయాల సందర్శనకు వెళ్లి ఒంగిఒంగి దండాలు పెట్టి నాటకాలు ఆడుతున్నారు. కళ్లార్పకుండా అబద్దాలు, మోసాలు చేస్తున్నారు. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు' అని వైఎస్సార్సీపీపై చంద్రబాబు విమర్శలు చేశారు. 'రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులుగా ఉన్న రాజకీయ పార్టీలతో పోరాడలేదు. మనది పాజిటివ్ పాలిటిక్స్ వారిది క్రిమినల్ పాలిటిక్స్ . గంజాయి బ్యాచ్ , రౌడీ బ్యాచ్ ను తయారు చేసి అరాచకం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులతో ఆడబిడ్డలకు, సమాజానికి రక్షణ లేదు' అని చంద్రబాబు వివరించారు. వారు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేయడానికి సుదీర్ఘ సమయం పడుతోందని.. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.