
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Ayodhya Ram Mandir Donations Case: అయోధ్యలోని శ్రీ రామ మందిరానికి వచ్చిన విరాళాల గోల్మాల్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో భారీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అలాగే మరో ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ రాజీనామాలను ట్రస్ట్ తన తదుపరి సమావేశంలో పరిశీలించనుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయి.. సిట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన సిట్ బృందం.. రెండు రోజుల క్రితమే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. 8 మంది విరాళాలు పక్కదోవ పట్టించినట్లు తేలగా.. ఇందులో ఆరుగురు ఆలయ ఉద్యోగులే ఉన్నట్లు గుర్తించారు.
ఆలయ విరాళాల పెట్టెల నుండి డబ్బులు సేకరించిన (దుర్వినియోగం చేసిన) ఘటనపై ట్రస్ట్ అభ్యర్థన మేరకు యోగి సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ సిట్ అందించిన మధ్యంతర నివేదిక ఆధారంగా ట్రస్ట్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. దీనిపై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా.. అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
శ్రీరాముని సేవ కోసం భక్తులు వ్యక్తిగతంగా అందజేసిన వెండి ఇటుకలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులన్నీ సురక్షితమైన ఖాతాలో భద్రంగా ఉన్నాయని ట్రస్ట్ భక్తులకు హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, చట్టప్రకారం దోషులకు అత్యంత కఠినమైన శిక్షలు పడేలా పట్టుబడతామని స్పష్టం చేసింది. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయడానికి కొందరు సంకుచిత, స్వార్థ శక్తులు ప్రయత్నిస్తున్నాయని.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు, నిరాధారమైన పుకార్లను నమ్మవద్దని, వాటికి దూరంగా ఉండాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలపై తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యామని పేర్కొన్న ట్రస్ట్.. నిష్పక్షపాత విచారణకు మరియు రామభక్తులకు పూర్తి భరోసా ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.