యువతితో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు.. ఆమెపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అయితే, అదే సమయంలో ఆ కారులో పేలుడు సంభవించి ఆ యువకుడు సజీవదహనమయ్యాడు.
ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. మృతిచెందిన యువకుడ్ని నాగేంద్రగానూ.. గాయపడిన యువతి ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన రమ్య ఉల్లాస్గా గుర్తించారు. ఆమె బెంగళూరులోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. గాయాలతో ఉన్న ఆమెకు ప్రస్తుతం తుమకూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం... నాగేంద్ర బెంగళూరులో ఈ కారును బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతను రమ్యతో కలిసి ప్రయాణించాడు. కారు డ్రైవర్ ప్రవీణ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. వారిద్దరూ బెంగళూరులో కలిసి వాహనం ఎక్కి అంకోలా వైపు బయలుదేరారు. కారు తుమకూరు సమీపంలోని ఒక ప్రాంతానికి చేరుకోగానే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు.ఈ గొడవ సమయంలో రమ్యపై నాగేంద్ర కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే, అతడి వద్ద బాంబు ఉందని ఆమె డ్రైవర్‌ను అప్రమత్తం చేసింది. గాయాలైనప్పటికీ.. ఎలాగోలా కారులో నుంచి బయటకు దూకేసింది. డ్రైవర్ కూడా వెంటనే కారును రోడ్డు పక్కన ఆపి కిందకు దిగిపోయాడు. నాగేంద్ర కారులోపల లాక్ చేసుకుని, తనతో తెచ్చుకున్న నాటు బాంబును పేల్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు గల ఖచ్చితమైన కారణం, ఆ పేలుడు పదార్థం ఎలాంటిది అనే విషయాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రవీణ్ కూడా గాయపడ్డాడు.దీని గురించి సమాచారం అందుకున్న తుమకూరు ఎస్పీ అశోక్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలిని సందర్శించారు. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశం, పేలుడుకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నారు.