
పశ్చిమాసియాలో పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్- అమెరికా పరస్పర దాడులు చేసుకుంటున్నాయి.
ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్ పై గుర్తు తెలియని క్షిపణి దాడులు చేసింది. ఈ దాడిలో ట్యాంకర్ లోని బ్రిడ్జ్ భాగం దెబ్బతింది. అయితే ఆ నౌకలోని సిబ్బంది మాత్రం సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.
పనామా జెండా కలిగిన కికు అనే నౌకపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటిష్ మేరిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ యూకేఎంటీఓ శనివారం పేర్కొంది. అయితే ఇరాన్- అమెరికా మధ్య దాడులు జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిందని తెలిపింది. మరోవైపు తమ భూభాగంపై డ్రోన్ దాడి జరిగినట్లు బహ్రెయిన్ ఆరోపించింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా అనేక డ్రోన్లతో ఇరాన్.. తమ దేశంపై దాడులు చేస్తోందని మండిపడింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.
మరోవైపు ఇదే సమయంలో ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్లు తెలిపింది. అయితే అమెరికా.. తమ స్థావరాలపై దాడులు చేసిన తర్వాతే తాము దాడులకు పాల్పడినట్లు పేర్కొంది. జూన్ 25 న సింగపూర్ జెండా కలిగిన కార్గో నౌకపై ఇరాన్ సైన్యం డ్రోన్ లతో దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్ కు చెందిన మిసైల్, డ్రోన్ స్టోరేజీ సైట్స్ పై అమెరికా బలగాలు దాడులు చేపట్టాయి. ఆ తర్వాత ఇరాన్ చెందిన రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికా సైన్యం మోహరించి ఉన్న స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఇలా ఇరాన్- అమెరికా మరోసారి పరస్పరం దాడులు చేసుకుంటున్న తరుణంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ సైన్యం దాడులు చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ ఫూలిష్ గా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇరాన్ దాడిలో అతిపెద్ద, ఖరీదైన కార్గో నౌక దెబ్బతిందని అన్నారు. అలాగే నౌకపైకి దూసుకొచ్చిన మరో మూడు డ్రోన్ లను అమెరికా సైన్యం కూల్చివేసిందని తెలిపారు. అయితే ఇరాన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. అలాంటి దాడులు జరగలేదని పేర్కొంది.