
ఇంటర్నెట్‌డెస్క్: స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా విజనరీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer).
దిల్‌రాజు (Dil Raju) నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇదే విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. తాజా ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. కేవలం నాలుగు పాటలకు రూ.75 కోట్లు ఖర్చు చేయడం సమంజసమా?అది మిస్‌ఫైర్ అయిందా? అని అడగ్గా.. దిల్‌రాజు వివరణ ఇచ్చారు.
‘‘దర్శకుడు శంకర్ సినిమాల్లో పాటలు చాలా స్పెషల్. ‘సినిమా అంతా సాధారణంగా తీసినా.. పాటలు ఒక్కోటి, ఒక్కో విధంగా డిజైన్ చేస్తాను’ అని ఆయన చెప్పారు. ఆయన పాటలను ఎలా తీస్తారో మనందరికీ తెలుసు. గత సినిమాల్లోనూ చూశాం. ఇక్కడ జరిగింది ఏంటంటే.. మూవీ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించనప్పుడు పాటలు ఎంత అద్భుతంగా తీసినా ఉపయోగం లేదు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలో అదే జరిగింది. ఒకవేళ కంటెంట్ సూపర్‌గా ఉండి, ఆడియో సూపర్‌హిట్ అయితే, అది సినిమాకు అదనపు బలం. అలా జరగనప్పుడు సినిమాకు నష్టమే. సినిమా షూటింగ్ కూడా సుదీర్ఘంగా సాగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిన మూవీ కావడంతో కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. స్టోరీలో కొత్తదనం లేక, ‘ఇది ఎక్కడో చూసినట్లు ఉందే’ అని చాలా మందికి అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు.
కొవిడ్, ఓటీటీ మార్కెట్ పెరిగిన తర్వాత రివ్యూల కారణంగా సినిమాలకు నష్టం జరుగుతోందన్నారు. ‘‘సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా.. రివ్యూల కారణంగా ‘ఓటీటీలో చూసేద్దాం లే’ అనుకుంటున్నారు. ప్రేక్షకుల అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల వేదికగా వేగంగా షేర్ అవుతున్నాయి. ఇది చిన్న సినిమాలకు నష్టం. న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తే, కొంత తగ్గవచ్చేమో. అలాగే సినిమా కలెక్షన్లకు, నిర్మాతలు వేస్తున్న పోస్టర్లలోని లెక్కలకు సంబంధం ఉండటం లేదు. ఒకరిని చూసి ఒకరు పోస్టర్లు వేస్తున్నారు. సక్సెస్ఫుల్ సినిమాను ఎవరూ ఆపలేరు. బాగోలేని సినిమాకు ఎవరెన్ని పోస్టర్లు వేసినా ముందుకు తీసుకెళ్లలేరు. ఏడేనిమిదేళ్లకొకసారి ప్రతి బిజినెస్‌మ్యాన్ ఇంటిలోనూ ఐటీ సోదాలు జరగడం సహజం. మేము చెబుతున్న దానికీ, పుస్తకాల్లో ఉన్నదానికీ సరిపోతుందా? లేదా? అని చెక్ చేసుకుంటారంతే. మూవీ బడ్జెట్లో అత్యధికభాగం హీరో పారితోషికానికే వెళ్లిపోతోంది. ఇప్పుడిప్పుడే అందరూ షేరింగ్ విధానంలోకి వస్తున్నారు. ఒకవేళ పరిస్థితి బాగోక మూవీ ఫ్లాప్ అయితే.. ఈ విధానంలో నిర్మాతకు కాస్త ఉపశమనం దొరుకుతుంది’’ అని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.