
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొద్దిరోజుల్లో వర్షాలు ఉద్ధృతం కానున్నాయి. దాంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లనున్నాయి.
వర్షాలు, వరదల కారణంగా నదుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతుంది. అయితే ఈ సీజన్ లో జలపాతాలు చాలా అందంగా ఉప్పొంగే నీటితో ప్రకృతి రమణీయంగా ఉంటాయి. ముఖ్యంగా నగరవాసులు జలపాతాలను చూసేందుకు దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ కు దగ్గరలోనే అందమైన.. ప్రకృతి రమణీయమైన జలపాతాలు ఉన్నాయి. వాటిని మీరు ఎప్పుడైనా చూశారా..? ఆ జలపాతాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
హైదరాబాద్ వాసులకు కాస్త రిలీఫ్ దొరికినా పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ కు దగ్గరలో ఈ జలపాతాల వివరాలు గురించి మీకు తెలుసా..? భాగ్యనగరానికి దగ్గరలో నాగార్జునసాగర్ ఎత్తిపోతల ఉంది. ఇక్కడ నీళ్లు దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు దుంకుతుంటాయి. చూసేందుకు ఈ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ కు కేవలం 150 నుంచి 160 కి.మీ. దూరంలోనే ఈ జలపాతం ఉన్న నేపథ్యంలో నగరవాసులు వీకెండ్ లో ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడ మొత్తం 26 క్రస్ట్ గేట్స్ ఉండగా వాటిని విడుదల చేసినప్పుడు ఆ అందమైన వ్యూ చాలా బాగుంటుంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తయిన, అందమైన జలపాతంగా కుంతాల జలపాతానికి పేరుంది. ఈ జలపాతం దట్టమైన సహ్యాద్రి- నల్లమల అడవులు కొండల మధ్య నుంచి ప్రవహిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఇది అద్భుతమైన పిక్నిక్ స్పాట్ గా ఉంది. ఈ జలపాతం నిర్మల్ జిల్లా పరిధిలోని నేరడిగొండ మండలంలో ఉంది. గోదావరి నదికి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. కుంతాల జలపాతం సుమారు 45 మీటర్ల ఎత్తు నుంచి రెండు అంచెలుగా కిందకు పడుతుంది.
అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగత జలపాతం ఉంది. ఈ ప్రాంతాన్ని తెలంగాణ నయాగరా అని పిలుస్తుంటారు. ఈ జలపాతం దట్టమైన అడవులు, కొండల మధ్య ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 170 కి. మీ. దూరంలో ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం చుట్టూ ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ విస్తరించి ఉంది. బొగత జలపాతం సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు జాలువారుతుంది. ఇక మల్లెలతీర్థం జలపాతం కూడా చాలా ఫేమస్.. ఈ వాటర్ ఫాల్స్ దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మార్గంలో దాదాపు 180 కి.మీ. దూరంలో ఈ జలపాతం నెలకొని ఉంది. వీటితోపాటు హైదరాబాద్ కు సమీపంలోనే భీమునిపాదం, పొచ్చర్ల, గాయత్రి జలపాతాలు పర్యటకుల్ని కనువిందు చేస్తున్నాయి.