
నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు.
మార్కాపురం, జూన్ 27: నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు(శనివారం) దోర్నాల మండలం గంటావానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు, రైతులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. నీళ్లు లేక చాలా మంది ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారని.. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. రాయలసీమ, మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ ఆలోచన చేశారని గుర్తుచేశారు.1996 మార్చి 26న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించామని.. రూ.900 కోట్లు పునరావాసం కోసం కేటాయించామని అన్నారు. రూ.300 కోట్లు మొదటి విడతలో నిర్వాసితులకు ఇస్తున్నామని చెప్పారు.
ఏపీలో చాలా ఇబ్బందులు ఉన్నాయని సీఎం అన్నారు. నక్సలిజంపై పోరాటం చేశానని.. క్లైమోర్ బాంబులు పెడితే వేంకటేశ్వరస్వామి తనను కాపాడారన్నారు. గత పాలకులు రూ.10 లక్షల కోట్లు అప్పులు పెట్టిపోయారని విమర్శించారు. 3,351 వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు రూ.300 కోట్లు జమ చేశామన్నారు. నిర్వాసితుల త్యాగం వృథా కాదని.. అందరికంటే మెరుగైన జీవితం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఈ టర్మ్‌లో రూ.3,900 కోట్ల వ్యయం అవుతోందన్నారు. 2027 నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫేజ్-1, ఫేజ్-2 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇడుపూరు, గోగులదిన్నే, తోకపల్లి తదితర పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేశామన్నారు. మార్కాపురానికి ప్రత్యేక జిల్లా ఇచ్చామని.. కలెక్టరేట్ కూడా పునరావాస కాలనీ పక్కనే వస్తుందని తెలిపారు. పునరావాస కాలనీ భవిష్యత్తులో ఆదర్శ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని సీఎం తెలిపారు. 43.5 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. సుంకేసుల, గొట్టిపడియ డ్యామ్‌లకు రూ.120 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చామని.. రూ.98 కోట్లతో సుంకేసుల పనులను ప్రారంభించినట్లు చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యమైందని విమర్శించారు. పదేళ్ల ముందే ప్రాజెక్టు పూర్తయి ఉంటే రైతుల జీవితాలు మారిపోయేవన్నారు. గొడ్డలి పార్టీ మోసాలు డిజిటల్ మోసాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు డ్రామాలు, మోసాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. డిజిటల్ అరెస్ట్ మోసాల తరహాలో వైసీపీ మోసాలు అంటూ దుయ్యబట్టారు. 2024లో కేటాయించిన నిధులను గత ప్రభుత్వం సరిగా వినియోగించలేదన్నారు. టన్నెల్-2లో యంత్రం చిక్కుకుపోయినా తొలగించకుండా ప్రారంభోత్సవం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగనివ్వమని.. బాధిత రైతులందరికీ న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుతో నాలుగు జిల్లాల అభివృద్ధి, భూముల విలువ పెరుగుతుందని చెప్పారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామన్నారు. వెలిగొండ పెండింగ్ బిల్లులన్నీ చెల్లించామని తెలిపారు. మార్కాపురం జిల్లాకు కరువు పరిస్థితులు తెలిసిన కలెక్టర్‌ను నియమించామని.. ఈ ప్రాంతంలో హార్టికల్చర్‌కు పెద్దపీట వేస్తామన్నారు. మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని అన్నారు. హార్టికల్చర్ అభివృద్ధికి రూ.1 లక్ష కోట్ల ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రూ.40 వేల కోట్లు ప్రభుత్వం, రూ.60 వేల కోట్లు ప్రైవేట్ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఎఫ్పీఓల ద్వారా రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
రామాయపట్నం పోర్టు, ఎయిర్‌పోర్ట్‌తో ఎగుమతులకు అవకాశముందని సీఎం అన్నారు. రోడ్లు, రైల్వే కనెక్టివిటీతో ప్రాంత అభివృద్ధి వేగవంతం చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తున్నామని.. మైక్రో ఇరిగేషన్‌కు మళ్లీ ప్రోత్సాహం అందిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. హంద్రీ-నీవా పూర్తి చేసి చివరి ప్రాంతాలకు నీళ్లు అందించామని వెల్లడించారు. పోలవరం ఆలస్యం వల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందన్నారు. అమరావతిని నిలిపివేయడం రాష్ట్రానికి నష్టమన్నారు. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అత్యంత కీలకమన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల జీవితాలు మారతాయని ధీమా వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. కులం, మతం ఆధారంగా కాకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలోనే మార్కాపురం అభివృద్ధి జరిగిందని చంద్రబాబు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతులతో నీటి వృథాను అడ్డుకున్నామన్నారు. 33 కొత్త గేట్లను ఏర్పాటు చేసి ముగ్గురు ముఖ్యమంత్రులం జాతికి అంకితం చేశామని తెలిపారు. గంగా, కావేరి నదుల అనుసంధానం అవసరమన్నారు. దేశంలో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థతో విద్యుత్ కొరత సమస్య తగ్గిందని చెప్పారు. సెల్‌ఫోన్ విప్లవం వల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. రైతుల్లో అభివృద్ధి దిశగా ఆలోచనా విధానం మారాలని సూచించారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకువస్తామన్నారు. అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి కావేరికి కూడా నీళ్లు ఇవ్వొచ్చన్నారు. దీని వలన ఐదు నదులు అనుసంధానం అవుతాయని.. నాలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు.
వెలిగొండ ప్రాజెక్టు రైతులు ఏపీకి ఆదర్శం..
‘మార్కాపురం జిల్లా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీ కంటికి కనిపించే నాయకుల్ని చూడొద్దు.. నన్ను చూడండి, పార్టీని చూడండి , ఎన్డీయే కూటమిని చూడండి. మీ ఆమోదం లేకపోతే ఎవరినీ నేను ఆమోదించను. అందరూ ఆమోదించే వ్యక్తి దొరకడం కూడా కష్టమే. పోలవరం నిర్వాసితులు త్యాగం చేశారు. అందుకే ఒకే నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చాను. వెలిగొండ ప్రాజెక్టు రైతులకు కూడా న్యాయం చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు రైతులు రాష్టానికి ఆదర్శం’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదు.. కానీ: పవన్ కల్యాణ్
వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.. భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్న రైతులు