
పెళ్లి చేసుకుంటానని మహిళలకు వల ఏలూరు జిల్లాలో నిత్య పెళ్లికొడుకు అరెస్టు ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ‘నేను ఓ పత్రికకు సీఈవోను. మాది సంపన్న కుటుంబం. తల్లిదండ్రులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.
సోదరి ఆస్ట్రేలియాలో ఉంది’ అని మాయమాటలు చెప్పి, మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వారి వద్ద నగలు, నగదు కాజేసిన ఓ నిత్య పెళ్లికొడుకు ఉదంతమిది. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరులోని పాండురంగానగర్‌కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావుకు భార్య, పిల్లలున్నారు. గతంలో ఇతడు ఓ పత్రికలో (ఈనాడు కాదు) పని చేశాడు. విలాసాలకు అలవాటు పడి, పెళ్లి చేసుకుంటానని మహిళలను మోసం చేస్తుండేవాడు. ఈ విషయం తెలిసిన పత్రికా యాజమాన్యం అతడిని ఉద్యోగం నుంచి తొలగించి, కేసులు పెట్టింది.
అయినా నిందితుడు అదే సంస్థకు సీఈవోనని చెప్పుకొంటూ భర్త చనిపోయిన, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తన వివరాలు పోస్టు చేసేవాడు. ఖరీదైన వస్త్రాలు, కార్లు, బంగారు ఆభరణాలు, బంగ్లా ఉండేలా పోస్టులు పెట్టేవాడు. ఇవన్నీ చూసి నిజమేనని నమ్మిన మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. అలా పలువురి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదు, బంగారు నగలు కాజేశాడు. అనంతరం వారి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేవాడు. బ్యాగులో ఎప్పుడూ పెళ్లి వస్త్రాలు, బాసికాలు సిద్ధంగా ఉంచుకునేవాడు. ఇలా తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం జిల్లా పరవాడ, తెలంగాణలోని కోదాడ తదితర ప్రాంతాల్లో మహిళలను మోసగించాడు. కొందరిని వివాహాలు చేసుకుని వదిలేశాడు. 2020 నుంచి ఇప్పటి వరకు 40 మందిని పైగా మోసం చేశాడు.
ఇటీవల ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని పరిచయం పెంచుకున్నాడు. అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి 10 కాసుల బంగారు నగలు, రూ.లక్ష తీసుకుని ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన ఆమె.. ముదినేపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ సారథ్యంలో సీఐ రవికుమార్ సాంకేతికత ఆధారంగా నిందితుడిని కనిపెట్టి అరెస్టు చేశారు. 8 కాసుల బంగారు నగలు, 6 ఫోన్లు, 10 సిమ్‌లు, 9 ఏటీఎం కార్డులు, రోల్డ్ గోల్డ్ కడియాలు, ఉంగరాలు, చైన్లు, పెళ్లి బాసికలు, 3 జతల దుస్తులు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.