
దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను భారీ రాబడుల పేరుతో ఆకర్షించి మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసిన రూ.159 కోట్ల విలువైన 23 ఆస్తులను ప్రభుత్వ సంస్థ MSTC ద్వారా ఈ-వేలం నిర్వహించింది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో బాధిత పెట్టుబడిదారులకు పరిహారంగా పంపిణీ చేయనున్నట్లు ఈడీ వెల్లడించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న బాధితులకు కొంత ఊరట లభించనుంది.
ఈ కేసులో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ స్థాపించిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. "ఇస్లామిక్ పెట్టుబడులు", "హలాల్ వ్యాపారాలు" పేరుతో ఏడాదికి 36 శాతానికి పైగా లాభాలు వస్తాయని ప్రచారం చేసింది. ఈ హామీలను నమ్మిన దేశవ్యాప్తంగా వేలాది మంది సంస్థలో పెట్టుబడులు పెట్టారు. దర్యాప్తులో హీరా గ్రూప్ దాదాపు రూ.5,978 కోట్లకు పైగా నిధులు సేకరించినట్లు ఈడీ గుర్తించింది.
అయితే, పెట్టుబడిదారులకు వాగ్దానం చేసిన లాభాలు చెల్లించకపోవడమే కాకుండా, అసలు పెట్టుబడి సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడినట్లు ఈడీ విచారణలో తేలింది. సేకరించిన నిధుల్లో కొంత భాగాన్ని వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన ఆస్తుల కొనుగోలు, అనుబంధ సంస్థలకు నిధుల బదిలీ వంటి అక్రమ కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. హీరా గ్రూప్‌కు చెందిన పలు స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. కేసు విచారణలో నౌహీరా షేక్ సహకరించడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు నివేదించగా, ఆమెకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనంతరం మే 21న గురుగ్రామ్‌లో ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
తాజాగా ఆస్తుల వేలం పూర్తవడంతో బాధిత పెట్టుబడిదారులకు న్యాయం చేసే ప్రక్రియలో కీలక ముందడుగు పడినట్లు అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వేలం ద్వారా వచ్చిన నిధులను అర్హులైన బాధితులకు దశలవారీగా పంపిణీ చేయనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. దీంతో చాలా కాలంగా తమ సొమ్ము కోసం పోరాడుతున్న వేలాది మంది బాధితుల్లో మరోసారి ఆశలు చిగురించాయి.
పుణే కేతన్ అగర్వాల్ హత్య కేసు...రంగంలోకి ‘26/11’ లాయర్
.