
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిచనుంది.
Telangana government Key decision _ Free laptops for BC residential students
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిచనుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశానికి మంత్రి ప్రభాకర్తోపాటుగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయదేవి, పాఠశాల, ఉన్నత, ఇంటర్ విద్యాశాఖ అధికారులు, ఈడబ్ల్యూఐడీసీ, నవోదయ విద్యాలయ సమితి, గురుకుల సొసైటీ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలకు డెస్క్టాప్ కంప్యూటర్లు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెళ్ల సరఫరాకు నిర్ణయం తీసుకున్నారు. బీసీ గురుకుల సొసైటీలో చదువుతున్న విద్యార్థి ఒకవేళ చనిపోతే రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను తల్లిదండ్రులకు చెల్లిస్తామని మంత్రి తెలిపారు. ప్రిన్సిపల్ పోస్టులను వందశాతం పదోన్నతులతో కాకుండా.. గతంలో ఉన్నట్లుగా 70శాతం ప్రమోషన్ల ద్వారా, 30శాతం ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టేందుకు బీసీ గురుకుల సొసైటీ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపారు.
అదేవిధంగా మహాత్మాజ్యోతిరావు ఫూలే గురుకుల సొసైటీ పేరులో మార్పులకు ఆమోదం తెలిపారు. ఇకపై మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల సొసైటీ బదులుగా తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యాసంస్థల సొసైటీగా మార్చాలని నిర్ణయించారు. కేంద్రానికి రాష్ట్రంలో 12 సైనిక పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని, ఆ ప్రతిపాదనల పరిస్థితిపై వివరాల నివేదిక తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.