
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ ‘బాహుబలి (Baahubali Movie)’.
రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ సత్తాను ప్రపంచదేశాలకు తెలిసేలా చేసింది. తాజాగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీని స్ట్రీమింగ్కు ముందు నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియోను ప్రదర్శించింది. అందులో సినీ ప్రియులకు సర్ప్రైజ్ ఇస్తూ ‘బాహుబలి 3’ (Baahubali 3) ఉంటుందని అధికారికంగా చెప్పారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ప్రపంచం ఈ ప్రకటనకు సిద్ధంగా లేదు.. మీ అందరికోసం బాహుబలి మూడో భాగం రానుంది’ అని ప్రభాస్, రానా, అనుష్క వెల్లడించారు.
ఇక ఈ వీడియోలో అనుష్క గురించి ప్రభాస్ (Prabhas) మాట్లాడుతూ.. ఓ ఫన్నీ విషయాన్ని పంచుకున్నారు. స్వీటీ నవ్వడం మొదలుపెడితే కనీసం 40 నిమిషాలు ఆపకుండా నవ్వుతుందని చెప్పారు. ఆమె రోజూ సెట్స్‌కు వచ్చేటప్పుడు ఈరోజు నవ్వకూడదు అనుకుంటూ వచ్చేదని.. నవ్వితే షూట్ మొత్తం ఆగిపోతుందని ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని అనుకునేదని సరదాగా తెలిపారు. ఈ చిత్రం తనకు ఓ ఎమోషనల్ జర్నీ అని ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు. ఇక సత్యరాజ్ మాట్లాడుతూ.. సెట్లో కాస్ట్యూమ్స్ చాలా ఉండేవని కనుచూపుమేరలో మొత్తం డ్రెస్‌లో ఉండేవని అదిచూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఏదేమైనా ‘బాహుబలి 3’ ఉంటుందని చెప్పడంతో అభిమానులు ఆనందిస్తున్నారు.
గతంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారంలో రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ.. బాహుబలి 3 తీయడానికి అవకాశం ఉందని.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పార్ట్ 3 తీస్తానని అన్నారు. ఇప్పుడు మరోసారి నటీనటులు దీనిపై స్పష్టత ఇవ్వడంతో ‘వారణాసి’ తర్వాత జక్కన బాహుబలి మూడో భాగం పనులు ప్రారంభిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రెండుభాగాలతో చరిత్ర సృష్టించిన రాజమౌళి మూడో భాగంతో దాన్ని తిరగరాస్తారని కామెంట్స్ చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.