
Sri Padmavathi Ammavari Teppotsavam: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పోత్సవ వేడుకలు నిన్న జూన్ 25 గురువారం ఎంతో వైభవంగా మొదలయ్యాయి. పద్మ సరోవరం వద్ద శ్రీకృష్ణ స్వామి వారు
దివ్య తప్ప విహారం చేయగా, భక్తులు ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకను వీక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఎంతో పుణ్యప్రదమైనది. ప్రస్తుతం ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో తెప్పోత్సవాన్ని చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొదటి రోజు శ్రీ రుక్మిణి, సత్యభామలతో కలిసి శ్రీకృష్ణ స్వామి వారు పద్మసరోవరంలోని అందమైన తెప్పపై మూడు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దివ్య దర్శనాన్ని ఇచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సుప్రభాతంతో మొదలైన ఈ వేడుకలు, నిత్య కైంకర్యాల అనంతరం మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామి వారి మఖమంటపంలో విశేష అభిషేకంతో కొనసాగాయి. సుగంధ దవ్యాలతో జరిగిన ఈ అభిషేకం భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది.
తెప్పోత్సవాల భాగంగా సాయంత్రం వేళ, స్వామివారు, అమ్మవారి ఉత్సవమూర్తులు మంగళ వాయిద్యాల మధ్య పద్మసరోవరంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆధ్యాత్మిక విహారం చేశారు. అనంతరం నలుగు వీధిలో ఊరేగి భక్తులపై కరుణా కటాక్షాలను కురిపించారు.
మరోవైపు, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్-2లో ఆధునికీకరించిన డిస్పెన్సరీని గురువారం ప్రారంభించారు. వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి ఇక్కడ ఈసీజీ, ఆక్సిజన్ వంటి అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు.