
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Jun 26 2026 12:05 PM | Updated on Jun 26 2026 12:30 PM
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక టీకా తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలి మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, టీకా తీసుకున్న వెంటనే మరణం సంభవించినప్పటికీ, టీకానే మరణానికి కారణమని ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పూర్తి స్థాయి వైద్య, ఫోరెన్సిక్, శాస్త్రీయ దర్యాప్తు అనంతరమే అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు.
ఘటన ఎలా జరిగింది? నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాధారణ రోగనిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 17 ఏళ్ల బాలికకు టెటానస్–డిఫ్తీరియా (Td) బూస్టర్ టీకా ఇచ్చారు. మధ్యాహ్నం సుమారు 12:40 గంటలకు టీకా తీసుకున్న అనంతరం ఆమె కొద్దిసేపు వైద్యుల పరిశీలనలో ఉండి బయటకు వచ్చింది. ఆ తర్వాత సమీపంలోని మెడికల్ షాప్ వద్దకు వెళ్లిన ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. తల తిరుగుతోందని చెప్పిన కొద్ది క్షణాల్లోనే స్పృహ తప్పి రోడ్డుపై కుప్పకూలింది. పడిపోయే సమయంలో తలకు తీవ్రంగా గాయమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు వెంటనే ఆమెను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
సీసీటీవీలో రికార్డైన ఘటన ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. వీడియోలో బాలిక సాధారణంగా నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా తూలి కిందపడిపోవడం కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, బాలిక మరణానికి టీకానే కారణమని సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, అధికారులు వాటిని ఖండించారు. ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేసిన వివరాల మేరకు.. ప్రస్తుతం టీకా వల్లే మరణం సంభవించిందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది టీకా వల్ల వచ్చిన అరుదైన ప్రతికూల ప్రతిస్పందనా? లేక ముందుగా ఉన్న గుండె సంబంధిత లేదా ఇతర ఆరోగ్య సమస్య వల్ల జరిగిందా?. లేదా కిందపడినప్పుడు తలకు తగిలిన గాయం కారణమా? అనే కోణాల్లో అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
టీకా బ్యాచ్ నిలిపివేత.. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన అధికారులు. ప్రజల్లో అనుమానాలు తలెత్తకుండా ఉండేందుకు, బాలికకు ఇచ్చిన అదే టీకా బ్యాచ్ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ బ్యాచ్‌కు చెందిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించారు. వాటి నాణ్యత, భద్రతపై ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అదే టీకా సీసా నుంచి మరో ఆరుగురికి టీకాలు ఇచ్చారు. వీరిలో నలుగురు గర్భిణులు, ఒక 16 ఏళ్ల బాలిక, ఒక 10 ఏళ్ల బాలుడు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు నమోదు కాలేదు. అదే టీకా బ్యాచ్‌కు చెందిన డోసులతో ఈ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 120 మందికి టీకాలు ఇచ్చారు. వారిలో కూడా ఎలాంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఆరోపణలు మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం టీకా తీసుకున్న వెంటనే తమ కుమార్తె కుప్పకూలిందని, అందువల్ల ఈ మరణానికి టీకానే కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనపై న్యాయపరమైన విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యువతి ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న ఆరోగ్య శాఖ పలు స్థాయిల్లో విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా యువతికి పూర్తి స్థాయి పోస్ట్‌మార్టం నిర్వహించారు. రక్తం, ఇతర జీవ నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. టీకా బ్యాచ్ నాణ్యతపై ప్రత్యేక ప్రయోగశాల పరీక్షలు జరుగుతున్నాయి. అవసరమైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం కూడా కేసును విశ్లేషించనున్నారు.
ఆరోగ్య శాఖ ఏమంటోంది? ఈ ఘటన నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అధికారిక నివేదికలు వెలువడే వరకు టీకాలపై అపోహలు సృష్టించవద్దు. టీకాలు ఇప్పటికీ ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనవేనని అధికారులు స్పష్టం చేశారు. కాగా, పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్, ప్రయోగశాల నివేదికలు వచ్చిన తర్వాతే బాలిక మరణానికి గల అసలు కారణంపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సీఎం హోదా పక్కనపెట్టి.. విజయ్ మరో సర్ప్రైజ్! (ఫొటోలు)
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి లేటేస్ట్ గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
నల్గొండ : ఎల్లమ్మకు బోనం సమర్పించిన మహిళలు (ఫొటోలు)
‘బాలీవుడ్ హంగామా అవార్డ్స్’ ఈవెంట్లో మెరిసిన బాలీపుడ్ భామలు (ఫొటోలు)
హీరోయిన్గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ.. దివిజ గ్లామర్ పిక్స్ చూశారా?
ఓరి మీ దుంపతెగా.. ఇదేం ప్రీవెడ్డింగ్ షూట్ రాబాబూ!
సిట్ విచారణలో కీలక నిజాలు.. స్టేషన్ CCTV ప్యూటేజ్ రెండు చోట్ల ఉంది